
Siya Goyal : మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ మృతి కేసులో దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేతన్ మరణం తర్వాత ఎలా బాధపడుతున్నట్లు కనిపించాలి, పోలీసులకు ఎలా దొరకకుండా ఉండాలి వంటి విషయాలపై సియా గోయల్ ఇంటర్నెట్లో వెతికినట్లు పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. కేతన్ చనిపోవడానికి ముందు అతడి తల్లికి క్షమాపణ చెప్పేందుకు ఏం రాయాలో కూడా ChatGPT సాయం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ వివరాలు సియా గోయల్, చేతన్ చౌదరి, రితేశ్ హాంగేలపై పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. డిజిటల్ ఆధారాలు, ఫొటోలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేతన్‌ను జూన్ 18, 2026న లోహగఢ్ కోట వద్ద కొండ అంచు నుంచి కిందికి తోసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. తొలుత కేతన్ ప్రమాదవశాత్తు కిందపడిపోయి చనిపోయినట్లు భావించారు.
కేతన్ మృతికి ముందు సియా అతడితో గొడవ జరిగిన తర్వాత అతడి తల్లికి భావోద్వేగంగా క్షమాపణ చెప్పేందుకు ChatGPT సాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. కేతన్‌ను ఎలా ఒప్పించాలనే విషయంలో కూడా ChatGPTని ఉపయోగించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కేసు గురించి మీడియాలో వచ్చిన వార్తలు, డిలీట్ చేసిన చాట్స్‌ను పోలీసులు తిరిగి పొందగలరా? వాటిని ఎలా రికవర్ చేస్తారు? వంటి విషయాలపై కూడా సియా, ఇతర నిందితులు ఇంటర్నెట్లో వెతికినట్లు దర్యాప్తులో బయటపడింది.
నిందితులకు సంబంధించిన సుమారు 1,801 చాట్స్, డిజిటల్ సంభాషణలను పోలీసులు పరిశీలించారు. ఫోరెన్సిక్ పరిశీలనలో డిలీట్ చేసిన 11 వాట్సాప్ చాట్స్‌ను కూడా తిరిగి పొందినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. అలాగే ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, ఫొటోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లలో జరిగిన కార్యకలాపాలను కూడా పోలీసులు పరిశీలించారు.
లోహగఢ్‌లో 2025లో జరిగిన ఓ మరణానికి సంబంధించిన సెర్చ్‌లను కూడా పోలీసులు గుర్తించారు. అలాగే మేఘాలయలో రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన సమాచారం కోసం కూడా వెతికినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నిందితులు చూసినట్లు చెబుతున్న కొన్ని క్రైమ్ సినిమాల వివరాలను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. కేతన్, సియా మే 31న లోహగఢ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ కేతన్ తర్వాత చనిపోయిన ప్రదేశంలోనే అతడిని నిలబడమని సియా చెప్పిందని.. ఆ తర్వాత వెనుక నుంచి వివిధ కోణాల్లో అతడి ఫొటోలు తీసిందని ఆరోపించారు. ఈ ఫొటోలు హత్యకు ముందస్తు ప్రణాళికలో భాగమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ తర్వాత జూన్ 14న ఇద్దరూ మరోసారి లోహగఢ్‌కు వెళ్లినట్లు ఛార్జ్‌షీట్‌లో ఉంది. కేతన్ మరణానికి నాలుగు రోజుల ముందు అతడిని కొండ అంచు నుంచి తోసేందుకు సియా ప్రయత్నించిందని.. అయితే ఆ ప్రయత్నం విఫలమైందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 9,200 వీడియోలను పరిశీలించారు. వీటితో పాటు సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలు, మొబైల్ లొకేషన్ వివరాలు, సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలించారు. లోహగఢ్ కోట వద్ద పర్యాటకులు తీసిన కొన్ని ఫొటోల్లో కేతన్, సియా, చేతన్ కనిపించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.









