Director Singeetham Srinivasa

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతీయ సినీ రంగానికి ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ఆయన వయోభారంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

దర్శకుడిగానే కాకుండా రచయితగా, కథకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. కమల్ హాసన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఎన్నో నేషనల్ అవార్డులు, నంది పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం అందుకున్నారు.

వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ.. సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త ప్రయోగాలతో తనదైన ముద్ర వేసిన సింగీతం జీవితం కొత్త తరం దర్శకులకు ఒక నిదర్శనం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. టాకీ కాలంలో కూడా మాటలు లేని కామెడీ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం సృష్టించారు. అదే పుష్పక విమానం.

అంతేకాకుండా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఏళ్ల కిందటే తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన అద్భుతమైన ఆలోచన ఆయన సొంతం. ఆదిత్య 369 మూవీతో గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా లెన్స్ ట్రిక్స్ ఉపయోగించి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యం కలిగించిన ఆయన తీరు ఇప్పటికీ మరువలేనిది. దశాబ్దాల సినీ ప్రయాణంలో నిరంతరం కొత్తదనాన్ని ప్రేక్షకులకు చూపించాలనే ఆయన తపన ఎంతో మందికి స్పూర్తిదాయకం.

ఇటీవలే సంభాషనలను సైతం సంగీతమయంగా మార్చే ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో సింగీతం దర్శకత్వం వహించిన కొత్త సినిమా ‘సింగ్ గీతం’. సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘ఆల్ మ్యూజికల్’ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే ఆయన ఆఖరి చిత్రం.