Hindu Temple :  అమెరికాలోని ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒహియో రాష్ట్రంలోని గ్రేటర్‌ క్లీవ్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామినారాయణ హిందూ టెంపుల్‌ వడ్తాల్‌ధామ్‌పై దుండగులు ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆలయ భవనం దెబ్బతినడంతో పాటు కిటికీలు పగిలిపోయాయి. దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజారులతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు.

హిందూ అమెరికన్‌ సమాజానికి సంబంధించిన సంస్థ కోయలిషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆలయంలో పూజారులు, భక్తులు ఉన్న సమయంలోనే ఇటుకలతో దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ దాడిని కోయలిషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా తీవ్రంగా ఖండించింది. రిచ్‌మండ్‌ హైట్స్‌ మేయర్‌ కిమ్‌ థామస్‌, నగర అధికారులు ఘటనను ఖండించాలని కోరింది. అలాగే దాడికి పాల్పడిన వ్యక్తిని త్వరగా గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ కూడా ఈ ఘటనపై స్పందించింది. అమెరికాలోని హిందూ సమాజంపై ఇటీవల ద్వేషపూరిత వ్యాఖ్యలు, దాడులు పెరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. భారతీయులు, హిందూ అమెరికన్లపై ద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలు బహిరంగంగా ఖండించాలని కోరింది.

Also Read : ఆస్పత్రికి వెళ్లి స్మిత్‌ మచ్చర్‌ను కలిసిన దుబాయ్‌ యువరాజు!

HAF ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుహాగ్‌ శుక్లా కూడా ఈ ఘటనను ఖండించారు. ఆన్‌లైన్‌లో కనిపించే ద్వేషపూరిత ప్రచారం ఇప్పుడు నిజ జీవితంలో హిందూ ఆలయంపై దాడిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆలయంలోని CCTV వీడియోలను పరిశీలించి నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ఈ ఘటన జరిగిన సమయంలో ఒహియోలోని భారతీయ-అమెరికన్‌ సమాజం హిందూ హెరిటేజ్‌ మంత్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదని హిందూ సంస్థలు చెబుతున్నాయి. 2022 ఆగస్టులో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న శ్రీ తులసి మందిరంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2023 డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉన్న SMVS శ్రీ స్వామినారాయణ ఆలయంపై అభ్యంతరకరమైన రాతలు రాశారు. 2024లో న్యూయార్క్‌, కాలిఫోర్నియాలోని BAPS ఆలయాల్లోనూ దాడులు, విధ్వంస ఘటనలు జరిగినట్లు హిందూ సంస్థలు తెలిపాయి. గతేడాది కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న BAPS ఆలయంపై కూడా ద్వేషపూరిత సందేశాలు రాశారని ఆ సంస్థ పేర్కొంది. తాజా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. ఏం చేస్తుందంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.