అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వేసిన దెబ్బకు G7 దేశాలు దిగివచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, ముడి చమురు ధరలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యవసర నిల్వల నుంచి ఏకంగా 10 కోట్ల బ్యారెళ్ల ఇంధనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అంగీకరించాయి. అలాగే భవిష్యత్తులో ఇంధన ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని స్పష్టమైన హామీ ఇచ్చాయి. రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. తన దేశంలో ధరలను తగ్గించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ తీసుకొచ్చిన గట్టి ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే యూరోపియన్ యూనియన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్ యూనియన్ తన దగ్గరున్న అత్యవసర డీజిల్ నిల్వలను వెంటనే బయటకు తీయాలని.. లేకపోతే తమ దేశం నుంచి యూరప్‌కు జరిగే డీజిల్ ఎగుమతులపై సంపూర్ణ నిషేధం విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం యూరప్ దేశాలు అమెరికా డీజిల్‌పై తీవ్రంగా ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ అమెరికా గనుక ఎగుమతులు నిలిపివేస్తే యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటుంది. దాంతో వేరే దారి లేక యూరప్ దేశాలు ట్రంప్ షరతులకు తలొగ్గాల్సి వచ్చింది.

Also Read : బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. ఏం చేస్తుందంటే?

అంతర్జాతీయ మార్కెట్లో చమురు నిల్వలను ఇలా బయటకు తీయడం ఇదే మొదటిసారి కాదు. ఇరాన్ యుద్ధం తీవ్రతరం అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఏకంగా రూ.40 కోట్ల బ్యారెళ్ల చమురును మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచ చరిత్రలోనే అత్యవసరంగా ఇంత పెద్ద మొత్తంలో చమురు నిల్వలను బయటకు తీయడం ఇదే తొలిసారి.

అయితే ఇప్పుడు ప్రకటించిన 10 కోట్ల బ్యారెళ్ల ఇంధన విడుదలకు సంబంధించి ఓ విషయంలో అయోమయం నెలకొంది. మార్చిలో కుదిరిన 40 కోట్ల బ్యారెళ్ల ఒప్పందంలో ఇప్పటికే దాదాపు మూడింట రెండు వంతుల ఇంధనాన్ని ఆయా దేశాలు మార్కెట్‌లోకి వదిలేశాయి. అంటే ఇంకా మూడింట ఒక వంతు ఇంధనాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఇప్పుడు G7 దేశాలు ప్రకటించిన కొత్త 10 కోట్ల బ్యారెళ్ల చమురు పాత ఒప్పందంలోని మిగిలిపోయిన భాగం నుంచే వస్తుందా లేక ఇది దానికి అదనంగా ఇస్తున్నారా అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది.

IEA సమన్వయంతో G7 సభ్య దేశాలన్నీ కలిసి ఒకేసారి ఈ 10 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను విడతలవారీగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నాయి. ఆయా దేశాలు తమ వద్ద ఉన్న అత్యవసర నిల్వల నుంచి ఈ ఇంధనాన్ని సేకరించి సరఫరా వ్యవస్థలోకి పంపుతాయి. దీనివల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా తగ్గి, సాధారణ ప్రజలకు, పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరట లభిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ప్లేన్ కూల్చేయడమే ప్లానా.. ఫ్లైదుబాయ్‌ ఘటనలో షాకింగ్ నిజాలు!