Hyderabad : హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి పూజారిపై దాడి చేయడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కర్రలతో కొట్టాడు. ఈ ఘటన దిల్ సుఖ్‌నగర్‌ బస్‌ డిపో పక్కన ఉన్న సంతోషిమాత ఆలయంలో జరిగింది. ఈ ఘటన మొత్తం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. పూజారిపై దాడి జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆలయంలో ఉన్న వారు వెంటనే అడ్డుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న కొందరు అతడిని కొట్టినట్లు తెలుస్తోంది.

పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి, అసలు ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మానసిక ఆరోగ్య పరీక్ష కూడా చేయిస్తున్నారు. అయితే అతడు ఆలయంలో ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడన్న విషయం మాత్రం వెంటనే తెలియలేదు. దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆలయాలకు భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు స్పందిస్తూ.. మతపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగే పరిస్థితికి ప్రభుత్వ విధానం కూడా కారణమవుతోందని ఆరోపించారు. ఆలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పు చేసినట్లు తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ ఆలయాలు, భక్తులకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై హైదరాబాద్ సీపీతో బండి సంజయ్ మాట్లాడారు. బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాలు, భక్తుల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బండి సంజయ్ అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆలయాల వద్ద భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.