Divya Mittal : మాజీ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగా ప్రజలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని చెప్పిన దివ్య మిట్టల్.. అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో ఆమె తన నిర్ణయం గురించి మాట్లాడారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను దగ్గరగా చూశానని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా, నిధులు ఉన్నా, నిబంధనలు ఉన్నా.. కొన్ని సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని దివ్య మిట్టల్ అన్నారు. కొంతమంది ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదని, వెళ్లినా వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.

Also Read : 10 ఏళ్ల బాలిక కోరిక.. జడ్జి సంచలన తీర్పు!

తనకు ఎదురైన ఓ సంఘటనను కూడా ఆమె ఈ వీడియోలో వివరించారు. ఓ మారుమూల గ్రామంలో ఐదో తరగతి తర్వాత కూడా చదువుకునే అవకాశం ఉండేలా పాఠశాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారని చెప్పారు. తాను ఆ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చినప్పటికీ.. చాలా సంవత్సరాలు గడిచినా పాఠశాల నిర్మాణం మొదలు కాలేదని తెలిపారు. అది నిధుల సమస్య కాదని, నిబంధనల సమస్య కూడా కాదని.. పని చేయాలనే ఉద్దేశం లేకపోవడమే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే భూమి లేని ఓ వ్యక్తికి ప్రభుత్వం స్థలం కేటాయించిందని, అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని దివ్య మిట్టల్ చెప్పారు. కానీ ఆ వ్యక్తికి భూమి మాత్రం స్వాధీనం కాలేదన్నారు.

తాను రాజకీయాల్లోకి రావడం కేవలం నాయకులను మార్చడం కోసం కాదని దివ్య మిట్టల్ చెప్పారు. రాజకీయాలు పనిచేసే విధానంలోనే మార్పు తీసుకురావాలనేది తన లక్ష్యమని తెలిపారు. తాను ఏదైనా ప్రస్తుత రాజకీయ పార్టీలో చేరబోతున్నాననే ప్రచారాన్ని కూడా దివ్య మిట్టల్ కొట్టిపారేశారు. ఏ పార్టీతోనూ కలిసి కాకుండా నేరుగా ప్రజలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. దివ్య మిట్టల్ 2013 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. సుమారు 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో పనిచేసిన ఆమె ఆగస్టు 2026లో ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మారుమూల గ్రామానికి పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందించడంలో ఆమె చేసిన కృషి అప్పట్లో చర్చకు వచ్చింది.

Also Read : అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వండి.. లేదంటే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ అల్టిమేటం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.