Rains
Rains

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం, సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణమే నెలకొంటుందని వెల్లడించారు. వర్షాల తీవ్రత తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో రాష్ట్రంలో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి మళ్లీ స్వల్పంగా వరద పెరుగుతోందని APSDMA ఎండీ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి ఈ వరద ప్రవాహం దాదాపు 8 నుండి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు.