
ఉదయాన్నే పరగడుపున ఆవిరి మీద ఉడికించిన ఒక్క ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉసిరిలోని అతిగా ఉండే వగరు, చేదు ధర్మాల వల్ల చాలామంది దానిని తినడానికి ఇష్టపడరు. అయితే స్వల్పంగా ఆవిరి పట్టి ఉడికించడం వల్ల అందులోని పోషకాలు, విటమిన్ సి నశించకుండా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక శక్తి
ఉసిరిని విటమిన్ ‘సి’ నిధిగా పరిగణిస్తారు. నారింజ పండు కంటే ఉసిరిలో దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. ఉసిరిని నీటిలో నేరుగా ఉడికించకుండా ఆవిరి మీద మాత్రమే ఉడికించడం వల్ల అందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇది శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, అలర్జీలు, వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మలబద్ధకానికి చెక్
ఉదయాన్నే పరగడుపున ఆవిరి పట్టిన ఉసిరిని తినడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగవుతాయి. ఇందులోని పీచుపదార్థం జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం సరిగ్గా అరిగేలా చేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థలోని టాక్సిన్లను బయటకు పంపి, పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుదలకు సహకరిస్తుంది.
ఒత్తైన జుట్టు
ఆవిరి ఉసిరిలో లభించే కొల్లాజెన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది ముఖంపై వచ్చే ముడతలు, సన్నని గీతలు, మచ్చలను నివారిస్తుంది. అలాగే జుట్టు మూలాలకు అవసరమైన పోషణను అందించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
గుండె ఆరోగ్యం
ఉసిరిలో క్రోమియం అనే మూలకం పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
వెయిట్ లాస్
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆవిరి ఉసిరి జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల రోజంతా శరీరం ఉత్తేజంగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆకలి కోరికలను నియంత్రించి, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి సులభంగా బరువు తగ్గడానికి మార్గం సుగమమవుతుంది.









