
బ్యాంకుల సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ATM లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. SBI కస్టమర్లు ఏ బ్యాంకు ATM నుంచి డబ్బులు తీసుకున్నా ఈ మూడు రోజులు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బ్యాంక్ సమ్మె ప్రభావం కస్టమర్లపై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది. SBI ATM మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించినా ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
సమ్మె సమయంలో కూడా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని SBI తెలిపింది. ATMలతో పాటు YONO, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే UPI, IMPS, RTGS, NEFT వంటి డిజిటల్ పేమెంట్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కస్టమర్లకు ఏదైనా సహాయం అవసరమైతే SBI 24×7 కాంటాక్ట్ సెంటర్ను సంప్రదించవచ్చని చెప్పింది. ఇందుకోసం 1800 1234 లేదా 1800 2100 నంబర్లకు కాల్ చేయొచ్చు.
మరోవైపు సెప్టెంబర్ 27 ఆదివారం రోజున అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయని SBI తెలిపింది. సమ్మెకు ముందు కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు ఈ అదనపు పనిదినం ఉపయోగపడుతుందని పేర్కొంది. సమ్మె సమయంలో నగదు విత్డ్రా, డిజిటల్ పేమెంట్లు, కస్టమర్ సపోర్ట్ వంటి సాధారణ బ్యాంకింగ్ సేవలకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు SBI తెలిపింది. సెప్టెంబర్ 24న సోషల్ మీడియాలో చేసిన పోస్టులో SBI.. “Banking doesn’t stop. Your needs don’t have to wait” అంటూ సమ్మె సమయంలో అందుబాటులో ఉండే సేవలను వివరించింది.









