Air India Pilot :  విమానం నడపడానికి ముందు చేసిన ఆల్కహాల్‌ పరీక్షలో ఎయిర్‌ ఇండియా కో-పైలట్‌ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఆయనను విమానం నుంచి దించి సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్‌ 6న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ విమానాశ్రయంలో జరిగింది. జ్యూరిక్‌ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం AI-151లో ఈ పైలట్‌ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన మద్యం తాగి ఉన్నారనే అనుమానంతో అధికారులు పరీక్ష చేశారు. మొదటి పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మరోసారి చేసిన పరీక్ష ఫలితం ఇంకా రావాల్సి ఉంది.

ఆ తర్వాత పైలట్‌ను ప్రయాణికుడిగా భారత్‌కు పంపించారు. తుది పరీక్ష ఫలితం వచ్చే వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉంటారని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఈ ఘటన కారణంగా ఆ విమానం ఆరోజు ఢిల్లీకి వెళ్లలేదు. మరుసటి రోజు విమానాన్ని నడిపారు. భద్రత విషయంలో ఎలాంటి తప్పును సహించబోమని ఎయిర్‌ ఇండియా తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. పైలట్లకు మద్యం, ఇతర మత్తు పదార్థాల పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తామని పేర్కొంది.

ఇటీవలే ఎయిర్‌ ఇండియాకు చెందిన మరో పైలట్‌ డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలారు. ఆగస్టు 4న ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో ఆయన పైలట్‌గా ఉన్నారు. ఒడిశా మీదుగా విమానం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు తగ్గింది. ఆ విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. ఈ ఘటన తర్వాత చేసిన డ్రగ్‌ టెస్టుల్లో పైలట్‌ సుదీప్‌ వశిష్ఠకు రెండుసార్లు గంజాయి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే తనకు నిద్ర సమస్య ఉండటంతో డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడుతున్నానని ఆయన చెప్పారు.

ఈ ఘటన తర్వాత ఎయిర్‌ ఇండియాలోని పైలట్లందరికీ డ్రగ్‌ టెస్టులు చేయాలని సంస్థ నిర్ణయించింది. పైలట్లు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకోనున్నారు. అంతేకాదు.. భద్రతా నియమాలపై పైలట్లకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.