
AI : భారత్‌లో యూట్యూబ్ క్రియేటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేలా యూట్యూబ్ కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ముఖ్యంగా షాపింగ్ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించేందుకు వీలుగా కొత్త మార్పులు చేసింది. దీంతో పాటు ఏఐతో పనిచేసే కొన్ని కొత్త టూల్స్‌ను కూడా ప్రకటించింది. యూట్యూబ్ షాపింగ్‌లో భాగంగా ఉండే అఫిలియేట్ ప్రోగ్రామ్‌లోకి ఇప్పుడు అమెజాన్ కూడా చేరింది. అజియో, మీషో, స్నాప్‌డీల్, టాటా క్లిక్ కూడా కొత్తగా ఈ ప్రోగ్రామ్‌లోకి వచ్చాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, పర్పుల్, షాప్సీ, టిరా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.
యూట్యూబ్ షాపింగ్‌ను భారత్‌లో 2024 అక్టోబర్‌లో ప్రారంభించింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న క్రియేటర్లు తమ వీడియోల్లో వివిధ ఉత్పత్తులను చూపించి వాటి లింకులను పెట్టొచ్చు. ఇది సాధారణ వీడియోలతో పాటు షార్ట్స్, లైవ్ వీడియోల్లో కూడా చేయొచ్చు. క్రియేటర్ పెట్టిన లింక్ ద్వారా ఎవరైనా ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తే, ఆ అమ్మకంలో కొంత మొత్తాన్ని క్రియేటర్‌కు కమిషన్‌గా యూట్యూబ్ ద్వారా అందుతుంది.
భారత్‌లో ఈ విధంగా క్రియేటర్లు సంపాదిస్తున్న డబ్బు కూడా బాగా పెరుగుతోందని యూట్యూబ్ తెలిపింది. 2025 మొదటి మూడు నెలలతో పోలిస్తే 2026 మొదటి మూడు నెలల్లో భారతీయ క్రియేటర్లకు వచ్చిన సగటు అఫిలియేట్ ఆదాయం 160 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆదాయం 100 శాతం పెరిగినట్లు యూట్యూబ్ చెప్పింది. భారత్‌లో 45 కోట్ల మందికి పైగా యూజర్లు యూట్యూబ్‌లో షాపింగ్‌కు సంబంధించిన వీడియోలను వెతుకుతున్నారని సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే షాపింగ్ వీడియోలను చూసే సమయం కూడా 55 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షాపింగ్‌కు సంబంధించిన ఫీచర్లను మరింత పెంచాలని యూట్యూబ్ నిర్ణయించింది. కొత్తగా ఆస్క్ యూట్యూబ్ లో కూడా కొన్ని మార్పులు చేసింది.
ఇకపై వీడియో చూస్తున్నప్పుడు అందులో కనిపించే ప్రొడక్ట్ గురించి నేరుగా యూట్యూబ్‌ను ప్రశ్నించొచ్చు. ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన వివరాలు, స్పెసిఫికేషన్స్ వంటి విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. ఒక ప్రశ్న అడిగిన తర్వాత దానికి సంబంధించిన మరో ప్రశ్న కూడా అడగొచ్చు. టీవీలో యూట్యూబ్ చూస్తున్నప్పుడు వాయిస్‌తో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ప్రేక్షకులు ఉన్న భారతీయ క్రియేటర్లకు కూడా ఈ కొత్త మార్పులు ఉపయోగపడనున్నాయి. వీడియో చూస్తున్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నారో బట్టి యూట్యూబ్ ప్రొడక్ట్ లింక్‌ను మార్చనుంది. అంటే అమెరికాలో ఉన్న వ్యక్తి వీడియో చూస్తే అక్కడ అందుబాటులో ఉన్న షాపింగ్ డీల్ కనిపిస్తుంది. ధర కూడా ఆ దేశ కరెన్సీలోనే కనిపిస్తుంది. దీంతో భారతీయ క్రియేటర్లు విదేశాల్లో ఉన్న తమ ప్రేక్షకుల నుంచి కూడా కమిషన్ సంపాదించే అవకాశం ఉంటుంది.
అలాగే క్రియేటర్ల ఫొటో, వాయిస్‌ను ఇతరులు తప్పుగా ఉపయోగించకుండా రక్షించేందుకు యూట్యూబ్ తన లైకెనెస్ ప్రొటెక్షన్ టెక్నాలజీని మరింత పెంచుతోంది. ఇందులో ముఖం, వాయిస్‌ను గుర్తించే టెక్నాలజీని ఉపయోగించనుంది. అమెరికాలోని యూజర్ల కోసం కస్టమ్ ఫీడ్స్ అనే ఫీచర్‌ను కూడా యూట్యూబ్ తీసుకురానుంది. దీని ద్వారా తమకు ఎలాంటి వీడియోలు ఎక్కువగా కనిపించాలో యూజర్లు మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే, క్రియేటర్లు యూట్యూబ్ ద్వారా మరింత సులభంగా షాపింగ్ నుంచి డబ్బు సంపాదించడంతో పాటు, ఏఐ సాయంతో వీడియోలు తయారు చేయడం, ఎడిట్ చేయడం, బ్రాండ్‌లతో పనిచేయడం సులభం చేసేలా యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.









