
Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల కోచ్ ప్రయాణంపై మాట్లాడాడు. ఈ రెండేళ్లలో విజయాలు, ఓటములు రెండూ చూశానని చెప్పాడు. తాను సాధించిన విజయాలను ఎలా స్వీకరిస్తానో.. ఎదురైన ఓటములను కూడా అలాగే అంగీకరిస్తానని గంభీర్ తెలిపాడు. ఈ రెండేళ్లు చాలా వేగంగా గడిచిపోయినట్లు అనిపించలేదు. ఈ సమయంలో నాకు కూడా ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్టులు, వన్డేలు, టీ20లు.. అన్ని ఫార్మాట్లలో విజయాలు వచ్చాయి. కొన్ని ఓటములు కూడా ఎదురయ్యాయి. కోచ్‌గా ఇలాంటి పరిస్థితులు సహజమే. విజయాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అదే సమయంలో నా వంతు ఓటములను కూడా పూర్తిగా అంగీకరిస్తాను అని గంభీర్ చెప్పాడు…
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న సంబంధం గురించి కూడా గంభీర్ మాట్లాడాడు. రోహిత్‌తో తన అనుబంధం కేవలం కెప్టెన్, కోచ్ మధ్య మాత్రమే కాదని చెప్పాడు. రోహిత్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి తనకు అతడితో పరిచయం ఉందని గుర్తు చేశాడు. ఇద్దరం కలిసి క్రికెట్ ఆడామని, అందుకే ఒకరి ఆలోచనలు మరొకరికి బాగా తెలుసని గంభీర్ చెప్పాడు. కొన్ని విషయాల్లో తన అభిప్రాయం వేరుగా ఉండొచ్చని, కెప్టెన్ ఆలోచన మరోలా ఉండొచ్చని తెలిపాడు. అయితే చివరికి జట్టుకు ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని చెప్పాడు.
తాను పనిచేసిన నలుగురు కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారని గంభీర్ చెప్పాడు. వాళ్ల ఆలోచనలు వేర్వేరుగా ఉండొచ్చు. ఆటను చూసే విధానం కూడా వేర్వేరుగా ఉండొచ్చు. కానీ జట్టు కోసం ఆలోచించడం మాత్రం అందరిలోనూ ఉంది. ఇది కోచ్‌గా నా పనిని సులభం చేసింది అని అన్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో తనకు గతంలోనే పరిచయం ఉందని గంభీర్ చెప్పాడు. కేకేఆర్‌లో కలిసి పనిచేశామని, 2018లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీని శ్రేయస్‌కు అప్పగించిన సమయంలోనే అతడిలో నాయకత్వ లక్షణాలు కనిపించాయని తెలిపాడు.
యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై కూడా గంభీర్ ప్రశంసలు చేశాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులభం కాదని చెప్పాడు. అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ గిల్ చాలా బాగా జట్టును నడిపించాడని అన్నాడు. రాబోయే రోజుల్లో గిల్ నుంచి మరింత మంచి ఆట చూస్తామని గంభీర్ చెప్పాడు. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డేలకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, టీ20లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్ జట్టుకు షై హోప్ నాయకత్వం వహించనున్నాడు.









