
UPI చెల్లింపులపై కొత్తగా వచ్చే MDR, GST విషయంలో చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. UPI చెల్లింపులపై GST మొత్తం డబ్బుపై ఉండదని, కేవలం MDR ఛార్జీపై మాత్రమే ఉంటుందని తెలిపింది. కొత్త రూల్స్ 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి జరిగే కొన్ని UPI వ్యాపార చెల్లింపులపై MDR వసూలు చేస్తారు. రూ.2,000 వరకు చేసే వ్యాపారి చెల్లింపులకు MDR ఉండదు. అర్హత ఉన్న లావాదేవీలపై MDR 0.4 శాతంగా ఉంటుంది. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 మాత్రమే వసూలు చేస్తారు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులపై మాత్రం ఎలాంటి MDR ఉండదు.
Also Read : అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్
ఉదాహరణకు ఒక షాపులో రూ.10,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లించారని అనుకుందాం. ఈ లావాదేవీకి 0.4 శాతం MDR అంటే రూ.40 అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. GST మొత్తం రూ.10,000పై ఉండదు. రూ.40 MDRపై మాత్రమే GST లెక్కిస్తారు. MDRపై GST 18 శాతం ఉంటే, రూ.40కు రూ.7.20 GST అవుతుంది. అర్హత ఉన్న GST రిజిస్టర్‌డ్ వ్యాపారులు ఈ GSTను తమ వ్యాపారానికి సంబంధించిన GST లెక్కల్లో, నిబంధనల ప్రకారం, సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. నెలకు UPI ద్వారా రూ. లక్ష వరకు డబ్బు స్వీకరించే అర్హత ఉన్న చిన్న వ్యాపారులకు MDR వసూలు చేయరు. అంటే MDR లేకపోతే దానిపై GST కూడా ఉండదు. చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులు, తక్కువ మొత్తంలో UPI చెల్లింపులు తీసుకునే వ్యాపారులకు ఇది ఊరట కల్పించనుంది.
కస్టమర్ల నుంచి UPI ఛార్జీ వసూలు చేయరు. కొత్త MDR అనేది వ్యాపారి వైపు ఉండే ఛార్జీ. UPI ద్వారా డబ్బు చెల్లించే కస్టమర్ నుంచి MDR వసూలు చేయకూడదు. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులు ఎప్పటిలాగే ఉచితంగా ఉంటాయి. రూ.2,000 వరకు చేసే వ్యాపారి చెల్లింపులకు కూడా MDR ఉండదు. MDR పేరుతో కస్టమర్లపై ఈ ఛార్జీని వేయకుండా బ్యాంకులు, పేమెంట్ సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన అర్హత ఉన్న వ్యాపారి UPI చెల్లింపులపై MDR అమల్లోకి వస్తుంది. అయితే కస్టమర్ చెల్లించిన మొత్తం డబ్బుపై GST ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే.. UPI ద్వారా రూ.10,000 చెల్లిస్తే రూ.10,000పై GST వేయరు. వ్యాపారికి వర్తించే MDR ఎంత ఉంటే, ఆ MDR మొత్తంపైనే GST లెక్కిస్తారు. ఇక నెలకు రూ.లక్ష వరకు UPI చెల్లింపులు స్వీకరించే అర్హత ఉన్న చిన్న వ్యాపారులకు MDR ఉండదు. కాబట్టి వారికి MDRపై GST చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం P2M UPI లావాదేవీల్లో దాదాపు 96 శాతం లావాదేవీలు MDR పరిధిలోకి రావు.
Also Read : సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ విచారణకు కోర్టు ఆదేశం!









