
Donald Trump : మనం ఎవరినైనా చంద్రుడు ఎవరిది అని అడిగితే ఏమని అంటారు.. మనందరిదీ అని చెప్పడం వింటాం. అంతే కదా.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇదే ప్రశ్నకు కాస్త భిన్నంగా సమాధానం ఇచ్చారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో చంద్రుడి ఫొటోను పోస్టు చేసిన ట్రంప్.. దానికి The Moon is Our అంటూ క్యాప్షన్ పెట్టారు. అంటే చంద్రుడు మాదే అని అర్థం. ట్రంప్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు అంతరిక్ష ప్రపంచంలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఏ దేశమైనా చంద్రుడిని నిజంగా తనదిగా చెప్పుకోగలదా? అమెరికా సంయుక్త రాష్ట్రాలు చంద్రుడిపై నియంత్రణను క్లెయిమ్ చేయగలదా? ఒకవేళ చంద్రుడు ఎవరికీ చెందకపోతే, దానిపై ఉన్న నీరు, మంచు, ఖనిజాలు ఎవరికి చెందుతాయి? వాటిపై ఎవరికీ హక్కు ఉంటుంది అనే విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంకా పూర్తి స్పష్టత లేదు.
Also Read : మీడియాకు ట్రంప్ షాక్.. వైట్ హౌస్‌లో ట్రంప్ టీవీ.. అసలు కథ ఇది!
ఈ విషయానికి సంబంధించిన ప్రధాన నియమాలు దాదాపు 60 ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయి. 1967లో ప్రపంచంలోని పలు దేశాలు ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతరిక్ష ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం చంద్రుడు, ఇతర గ్రహాలు లేదా ఖగోళ వస్తువులను ఏ ఒక్క దేశం తన సొంత ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అంటే అమెరికా చంద్రుడిపై జెండా పాతినా, అక్కడ భవనాలు నిర్మించినా, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినా.. చంద్రుడి భూమి అమెరికాదిగా మారదు. ఇదే నిబంధన చైనా, రష్యా, భారత్ సహా అన్ని దేశాలకూ వర్తిస్తుంది.
అందుకే చంద్రుడిపైకి వెళ్లడం, అక్కడ పనిచేయడం ఒకటి అయితే.. చంద్రుడిని సొంతం చేసుకోవడం మరో విషయం. ఒక దేశం అక్కడికి వెళ్లి తన జెండాను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం తనదని చెప్పుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన చంద్రుడు మాదే అనే కామెంట్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా అధికారికంగా చంద్రుడిపై హక్కు ప్రకటించినట్లుగా చూడలేం. అది ప్రధానంగా సోషల్ మీడియాలో చేసిన పొలిటికల్ కామెంట్ గానే భావించాల్సి ఉంటుంది.
చంద్రుడి వనరుల విషయంలో అమెరికా ఇప్పటికే తనదైన చట్టాన్ని తీసుకొచ్చింది. 2015లో అమెరికా ఒక చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం అమెరికా పౌరులు, కంపెనీలు అంతరిక్షంలోని వనరులను సేకరించి వాటిని ఉపయోగించుకునే హక్కు కలిగి ఉంటారు. అయితే దీని అర్థం చంద్రుడు లేదా ఇతర ఖగోళ వస్తువులు అమెరికా సొంతం అవుతాయని కాదని అమెరికా స్పష్టం చేసింది. చంద్రుడి భూమిపై హక్కు కలిగి ఉండటం, అక్కడి నుంచి ఒక వనరును తీసుకుని ఉపయోగించడం రెండూ వేర్వేరు విషయాలన్నది అమెరికా వాదన.
దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే.. చంద్రుడి భూమి ఎవరి ప్రైవేట్ భూమి కాదని అనుకుందాం. కానీ అక్కడికి వెళ్లిన ఒక కంపెనీ నీరు లేదా ఖనిజాలను సేకరిస్తే.. వాటిని ఆ కంపెనీ ఉపయోగించుకోవచ్చా అనే ప్రశ్న వస్తుంది. అమెరికా చట్టాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి. అయితే దీనిపై అంతర్జాతీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు చంద్రుడిలోని అత్యంత విలువైన ప్రాంతాల నుంచి భారీగా వనరులను తీసుకుని వాటిపై తమ నియంత్రణ పెంచుకుంటే.. చంద్రుడు మొత్తం మానవాళికి అందుబాటులో ఉండాలనే అంతర్జాతీయ ఒప్పందాల ఉద్దేశానికి అది విరుద్ధంగా మారుతుందా అనే ప్రశ్న కూడా ఉంది.
ఉదాహరణకు భవిష్యత్తులో ఒక అమెరికా కంపెనీ చంద్రుడిపైకి వెళ్లి 100 టన్నుల నీటి మంచును సేకరించిందని అనుకుందాం. ఆ మంచు మొత్తం ఆ కంపెనీదే అవుతుందా? అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ వనరులను సేకరించినట్లయితే వాటిని ఉపయోగించవచ్చని ఒక వాదన ఉంది. కానీ మరోవైపు.. చంద్రుడిపై ఉన్న అత్యంత విలువైన వనరులను కొన్ని దేశాలు, కంపెనీలు మాత్రమే తమ ఆధీనంలోకి తీసుకుంటే మిగతా దేశాలకు ఏమి మిగులుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అందుకే చంద్రుడి భూమిపై యాజమాన్యం, అక్కడి నుంచి తీసుకునే వనరులపై హక్కు అనే రెండు అంశాలను వేర్వేరుగా చూడాల్సి వస్తోంది.
Also Read : ఇరాన్‌కు అమెరికా మరో షాక్… విమానాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు
సూటిగా చెప్పాలంటే.. చంద్రుడు ఏ ఒక్క దేశానికీ చెందినవాడు కాదు. అమెరికా, చైనా, రష్యా, భారత్ లేదా మరే ఇతర దేశమైనా చంద్రుడిపై జెండా పెట్టి దాన్ని తమ దేశ భూభాగంగా ప్రకటించుకోలేవు. కానీ చంద్రుడి నుంచి నీరు, మంచు, ఖనిజాలు వంటి వనరులను తీసుకుని ఉపయోగించుకునే హక్కు విషయంలో మాత్రం ఇంకా చర్చ కొనసాగుతోంది. అమెరికా చంద్రుడి వనరులను సేకరించి ఉపయోగించవచ్చని చెబుతుండగా.. కొన్ని అంతర్జాతీయ వ్యవస్థలు మాత్రం వాటిని మొత్తం మానవాళికి చెందిన ఉమ్మడి సంపదగా చూస్తున్నాయి.
అంటే భవిష్యత్తులో చంద్రుడి కోసం జరిగే పోటీ కేవలం అక్కడికి మొదటగా ఎవరు చేరుకుంటారనే దానిపై మాత్రమే ఉండకపోవచ్చు. చంద్రుడిపై ఉన్న నీరు, మంచు, ఖనిజాలను ఎవరు ఉపయోగించుకుంటారు? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటిపై ఎలాంటి నియమాలు ఉండాలి? ఆ నియమాలను ఎవరు నిర్ణయించాలి? అనే ప్రశ్నలే మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. ట్రంప్ చంద్రుడు మాదే అంటూ చేసిన సోషల్ మీడియా వ్యాఖ్య ఒక రాజకీయ ప్రకటనగానే ఉన్నప్పటికీ.. అది చంద్రుడి భవిష్యత్తు, అంతరిక్ష వనరులపై హక్కుల గురించి మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరతీసింది.









