Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయోజనాల కోసం అవసరమైతే మిత్రదేశాల గొంతు నులమడానికి కూడా సిద్ధమవుతాడని మరోసారి రుజువైంది. పశ్చిమాసియాలో తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాకు అమెరికా గట్టి షాకివ్వడమే ఇందుకు నిదర్శనం. వరుసగా డ్రోన్లు, రాకెట్‌ లాంచర్లతో సౌదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యెమెన్‌లోని తిరుగుబాటుదారులైన హూతీలపై దాడి చేయబోమని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు వారితో ట్రంప్ శాంతి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు రక్షణగా అమెరికా యెమెన్‌లోని హూతీ స్థావరాలపై దాడులు చేయడానికి సిద్ధమైంది. హూతీలపై బాంబర్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుందని ప్రచారం కూడా సాగింది. ఈ మేరకు హూతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు మొదలవుతాయనే అంతా అనుకుంటున్న సమయంలో, అనూహ్యంగా అమెరికా వెనక్కు తగ్గడం సంచలనంగా మారింది. మిత్రదేశమైన సౌదీ అరేబియా సాయం కావాలని స్వయంగా అడిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా ఈ మిషన్‌ నుంచి వైదొలిగారు. ఎర్ర సముద్రం సమీపంలోని ప్రధాన వ్యూహాత్మక ప్రాంతాల్లో యెమెన్‌ మిలిషియా, హూతీలు పెద్ద ఎత్తున వేగంగా తమ పట్టుసాధిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : టార్గెట్‌ ఇమ్రాన్‌ఖాన్‌.. పాక్‌లో ముసుగు వ్యక్తుల దాడి, మంత్రి కిడ్నాప్; వీధుల్లోకి PTI ..

ఇటీవల యెమెన్‌ పశ్చిమ, దక్షిణ తీరప్రాంతాన్ని మొత్తాన్ని హూతీలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధిపై వారు గురిపెట్టారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఈ జలసంధి అత్యంత కీలకమైంది కావడం గమనార్హం. ఆసియా-యూరప్‌- అమెరికా మధ్య వాణిజ్య నౌకల రాకపోకలు ఎక్కువగా ఈ మార్గంలోనే జరుగుతుంటాయి. దీంతో ఈ మార్గం గుండా వచ్చే తమ నౌకలపై దాడులు చేయకుండా హూతీలతో అమెరికా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమెరికా నౌకలపై దాడులు చేయబోమని హూతీల రాజకీయ విభాగం సభ్యుడు మొహమెద్‌ అల్‌ బుఖైతీ ప్రకటించడం విశేషం. అదే సమయంలో సౌదీకి మద్దతిచ్చే దేశాల నౌకలపై మాత్రం దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. మక్కా రక్షణ సహకార ఒప్పందం పేరుతో తమపై పాకిస్థాన్‌, తుర్కియేలు దాడి చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని హూతీలు హెచ్చరించారు.

ట్రంప్‌ సడన్‌గా హూతీలపై దాడులు ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆయన అంతర్గత బృందంలోని చాలా మంది సభ్యులు హూతీలకు వ్యతిరేకంగా, సౌదీకి సాయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్‌ పోరులో అమెరికా సైన్యం ఇప్పటికే తీవ్ర ఒత్తిడి గురవుతుందని, ఈ సమయంలో హూతీలతో వైరం కొనితెచ్చుకోవడం సరికాదని వారు వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అమెరికా నౌకలను టార్గెట్‌ చేయబోమని హూతీలు కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యంతో చర్చలు జరిపినట్లు హూతీల పొలిటికల్‌ విభాగం సభ్యుడు మొహమ్మద్‌ అల్‌ బుఖైతీ వెల్లడించడం గమనార్హం. అంతేకాదు ఇతర దేశాల నౌకల జోలికి కూడా వెళ్లబోమని తేల్చి చెప్పారు. ‘సౌదీని మినహాయిస్తే ఈ ఎర్ర సముద్రంలో మరే ఇతర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోం. ఇకపై చేసుకోము కూడా. ఇతర దేశాలు మాకు వ్యతిరేకంగా సౌదీ అరేబియాతో చేతులు కలపనంత వరకూ మేము ఎవరి జోలికీ వెళ్లము’ అని బుఖైతీ స్పష్టం చేశారు.

Also Read : టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఉద్యోగాల కోత.. రెండు నెలల్లో రెండోసారి..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.