Delhi Court : కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ లిస్ట్ కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను గతంలో తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాన్ని తాజాగా కొట్టివేసింది. ఈ కేసును మళ్లీ పరిశీలించాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. సోనియా గాంధీ పేరు 1980 లోని ఓటర్ లిస్ట్‌లో చేరిందని, అయితే ఆమె 1983లో భారత పౌరసత్వం తీసుకున్నారని పిటిషనర్ వికాస్ త్రిపాఠి ఆరోపించారు. నకిలీ పత్రాలు ఉపయోగించి ఆమె పేరు ఓటర్ లిస్ట్‌లో చేర్చారని ఆయన ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఇవి పిటిషనర్ చేసిన ఆరోపణలు మాత్రమే.

ఈ పిటిషన్‌ను గతంలో మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అయితే ఆ నిర్ణయంలో ఆరోపణలను ఎందుకు తిరస్కరించారో సరైన కారణాలు చెప్పలేదని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే పేర్కొన్నారు. ఆ ఆర్డర్‌లో వివరమైన కారణాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. అలాగే 1980లో ఓటర్ లిస్ట్‌లో సోనియా గాంధీ పేరు ఉండటం, 1982లో పేరు తొలగించడం, మళ్లీ 1983లో పేరు చేర్చడం వంటి అంశాలను కూడా మేజిస్ట్రేట్ కోర్టు సరిగా పరిశీలించలేదని జడ్జి చెప్పారు. ఈ అంశాలపై ఫిర్యాదులో నేరం జరిగిందా లేదా అనే విషయాన్ని కారణాలతో పరిశీలించాల్సి ఉందని తెలిపారు.

అంతేకాదు, పోలీసు అధికారిని కూడా విచారించకుండా, పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్ట్ తీసుకోకుండా మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం తీసుకుందని జడ్జి పేర్కొన్నారు. అందుకే కేసును మళ్లీ పరిశీలించాలని ఆదేశించారు. అయితే సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఇప్పుడే ఆదేశించలేదు. ముందుగా మేజిస్ట్రేట్ కోర్టు ఫిర్యాదుదారుడిని, పోలీసు అధికారిని విని, అవసరమైన విచారణ జరిపి కొత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 29న జరగనుంది.

గతంలో మేజిస్ట్రేట్ కోర్టు.. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో, ఓటర్ లిస్ట్‌కు సంబంధించిన విషయాలు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయని చెప్పింది. అయితే ఈ కేసులో ఆ కారణంతోనే ఫిర్యాదును తిరస్కరించడం సరైన విధానం కాదని తాజా కోర్టు అభిప్రాయపడింది. ఇక పిటిషనర్ వికాస్ త్రిపాఠి 2025 సెప్టెంబర్ 11న ఇచ్చిన మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌పై మళ్లీ విచారణ జరగనుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.