Donald Trump :  ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే సమయంలో యెమెన్‌లోని హౌతీలతో అమెరికా చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. హౌతీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వారి నుంచి ఏదైనా ఒప్పందానికి రావచ్చా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న హౌతీలతో ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Also Read : సౌదీ పైప్‌లైన్‌పై దాడి.. భారత్‌కు చమురు షాక్.. పాక్ మిలటరీ ఎంట్రీ వెనుక బిగ్ ట్విస్ట్!

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై కూడా ట్రంప్ మాట్లాడారు. అమెరికా ఈ యుద్ధంలో చాలా స్పష్టంగా ముందంజలో ఉందని ఆయన అన్నారు. యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఆయన ఎలాంటి స్పష్టమైన తేదీ చెప్పలేదు.

ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడానికి అమెరికన్లు కొంత భారం భరించాల్సి రావచ్చని ట్రంప్ చెప్పారు. ఇందుకోసం ఇంధన ధరలు పెరగడం కూడా భరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌కు అణ్వాయుధం ఉండటం కంటే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటాన్ని అమెరికన్లు అంగీకరిస్తారని ట్రంప్ అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత పెట్రోల్ ధరలు మళ్లీ గతంలో ఉన్న స్థాయికి వస్తాయని, అంతకంటే కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవడాన్ని అమెరికా చేపట్టిన చర్యల్లో ప్రధాన లక్ష్యంగా ట్రంప్ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం పడుతోంది. హోర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు, ప్రాంతంలో జరుగుతున్న దాడుల కారణంగా చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. రష్యా, ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించిన కొత్త చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 పేరుతో ఉన్న ఈ చట్టం ద్వారా రష్యా, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, సుంకాలు విధించే అధికారాలను మరింత పెంచారు.

Also Read : డెంగ్యూ డేంజర్‌కు ఎండ్ కార్డ్.. 2027లో భారత్‌లోకి రాబోతున్న సైలెంట్ కిల్లర్ వ్యాక్సిన్ క్యూడెంగా!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.