Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నందిగ్రామ్‌ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సంచితా ప్రధాన్‌ డే పోటీ నుంచి తప్పుకోవడంతో.. కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నందిగ్రామ్‌ నుంచి తమ వర్గం మరో అభ్యర్థిని బరిలోకి దించబోదని మమత స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఇండియా కూటమికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలోని ఇతర నేతలతో కూడా తాను మాట్లాడినట్లు మమత వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తనకు ఫోన్‌ చేశారని, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా సందేశం ద్వారా మద్దతు తెలిపారని చెప్పారు.

అక్టోబర్‌ 6న జరగనున్న నందిగ్రామ్‌ ఉపఎన్నికకు మమతా వర్గం తరఫున సంచితా ప్రధాన్‌ డేను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎన్నికలకు సుమారు నెల రోజుల ముందు ఆమె అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సంచితా ప్రధాన్‌ డే రాష్ట్ర సచివాలయం నబన్నాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాన్ని తొలుత మర్యాదపూర్వక భేటీగా పేర్కొన్నప్పటికీ.. నందిగ్రామ్‌ మాజీ ఎమ్మెల్యే అయిన సువేందు అధికారి, మమతా బెనర్జీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరు కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా.. టీఎంసీలోని రెండు వర్గాల మధ్య పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ వర్గానికి మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అనే పేరును, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుర్తును కేటాయించింది. మరోవైపు రితబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో పాటు ఎన్వలప్‌ గుర్తును కేటాయించింది. అయితే ఈ పేర్లు, గుర్తులు ప్రస్తుతం జరగనున్న ఉపఎన్నికల వరకే తాత్కాలికంగా వర్తిస్తాయి

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.