
Karnataka : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను కాపీ కొడుతున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రజల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మంచి ఆదరణ ఉందని ఆయన చెప్పారు.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ గ్యారంటీ పథకాలు బ్లాక్‌బస్టర్ గా మారాయని పేర్కొన్నారు. అమెరికాలో రిపబ్లికన్లు నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ ఆధిపత్యం కొనసాగిస్తే.. ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు ఇస్తామని ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ఈ హామీని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలతో పోల్చారు.
రిపబ్లికన్లు ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని ప్రతి వయోజనుడికి 5,000 డాలర్లు డివిడెండ్‌గా ఇస్తామన్న తన ప్రతిపాదనను ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం సేకరిస్తోందని, అందువల్ల ఈ డబ్బును ప్రజలకు ఇవ్వడం సులభమేనని ఆయన అన్నారు.
ఆదివారం ఐర్లాండ్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. రిపబ్లికన్లు గెలిస్తే ఇది సులభమే. దేశంలోని ప్రతి వయోజనుడికి 5,000 డాలర్లు ఇవ్వొచ్చు. మనకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది కాబట్టి ఈ మొత్తాన్ని సులభంగా సమకూర్చగలం అని చెప్పినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.
ట్రంప్ తొలిసారిగా ఈ ప్రతిపాదనను డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ప్రకటించారు. అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోందని చెబుతూ, ఆ డబ్బులో కొంత భాగాన్ని ప్రజలకు చెల్లింపుల రూపంలో అందించాలనే ఆలోచనను ఆయన వెల్లడించారు.









