
BIG NEWS :ధురంధర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. దేశ శత్రువులపై నిఘా పెట్టి, రహస్య ఆపరేషన్లతో వారిని టార్గెట్ చేసే కథ.. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రంలో హీరో తను టార్గెట్ చేసిన తీవ్రవాదులను పక్కాప్లాన్‌తో చంపడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం చేస్తుంటాడు. అయితే ఈ సినిమాలో చూపించినట్లే పాకిస్థాన్‌లోనూ కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ఇపుడు ఆ దేశానికి, ముఖ్యంగా అక్కడి ఉగ్రవాద గ్రూపులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ వివిధ ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు పక్కా ప్లాన్‌తో హతమార్చడం..ఆ తర్వాత జాడ లేకుండా పోవడం పాక్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరాచీలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పాకిస్థాన్‌లో అలజడి సృష్టిస్తోంది.
కరాచీలో లష్కరే తోయిబా (LeT) ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి కాల్చిచంపడం కలకలం రేపింది. కరాచీలోని భైంస్ కాలనీలో ఉన్న రోడ్ నంబర్ 11 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే మృతుడు ఎవరు? అతడికి ఐఎస్ఐతోకానీ, తీవ్రవాద గ్రూపులతో కానీ ఉన్న సంబంధాలపై పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతనిపై దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. అయితే చనిపోయిన వ్యక్తి లష్కరే తోయిబా( ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానిక మీడియా సంస్థలు కొన్ని కథనాలు వెలువరించాయి. కాగా బైక్‌లపై సాధారణ వ్యక్తుల్లాగే వచ్చిన నలుగురు టార్గెట్‌ను గుర్తించి అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతం జనాల రాకపోకలు ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం భయపడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మరోసారి చర్చనీయంశంగా మారింది.
పాక్ లో హత్యలు కొత్తేమీ కాదు
కాగా, గతకొంతకాలంగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు సంచలనంగా మారాయి. ఈ ఘటనలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా ఈ హత్యలు జరగడం మరింత చర్చకు దారి తీసింది. 2026 ఆగస్టులో లష్కరే తోయిబాకు చెందిన రిజ్వాన్ హనీఫ్ చేసినట్లు ప్రచారం జరిగిన వీడియో ఒకటి ఇటీవల వైరల్‌గా మారింది. గత మూడు నాలుగేళ్లలో పాకిస్థాన్‌లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు అతను వీడియోలో చెప్పినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. పాక్‌లోని పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు అతని మాటల్లో ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సంఖ్యను పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ధ్రువీకరించలేదు. అంతేకాదు.. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నదానిపైనా ఇంతవరకు క్లారిటీ లేదు.
భారత్‌పై ఆరోపణలు..
ఇక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పాక్ భారత్‌పై ఆరోపణలు చేయడం సర్వసాధారణమైంది.ఈ వరుస హత్యలపై పాకిస్థాన్‌లోని కొందరు అధికారులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు భారత నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే భారత్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. 2024లోనూ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురు హత్య గావించబడటం వెనుక భారత్ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పాకిస్థాన్ అధికారులు కనీసం ఎనిమిది హత్యలకు భారత్ కారణం అంటూ ప్రకటించారు. కానీ, వేటికి సరైన ఆధారాలు మాత్రం చూపించలేదు. అయితే పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత వైరం, ఆధిపత్య పోరు మూలంగా కూడా ఈ హత్యలు జరగవచ్చన్న అనుమానాలు లేకపోలేదు. అయితే పాక్‌లో ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. కరాచీలో గతంలో రాజకీయ, జాతి, మతపరమైన కారణాలతో పలువురు హత్యకు గురయ్యారు. 2011లోనే నగరంలో జరిగిన వరుస టార్గెట్ కిల్లింగ్స్‌లో ఒక్క జూలై నెలలోనే 300 మందికి పైగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈ హత్యల వెనుక ఏ దురంధర్ ఉన్నాడో లేక ఏ ఉగ్రవాద సంస్థ ఉందో నిఘా వర్గాలు బయటపెట్టాల్సి ఉంది.









