
Oracle layoffs : ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్.. మరో వైపు ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించే చర్యలకు దిగింది. సంస్థలో గతంలోనే కొంతమందికి ఉద్వాసన పలికిన సంస్థ తాజాగా మరికొంతమందిని ఇంటికి పంపడానికి సిద్ధమైంది. తాజాగా రెండో విడత ఉద్యోగాల కోతలు ప్రారంభించింది. సంబంధిత ఉద్యోగులకు ఈ తెల్లవారుజాము నుంచే ఈ-మెయిల్స్ పంపి.. వారి పోస్టులను తొలగించినట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళిక, విస్తృత స్థాయి సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబధిత మెయిల్స్‌లో వెల్లడించింది. కాగా ఈ తాజా తొలగింపులపై ముగ్గురు బాధిత ఉద్యోగులతో మాట్లాడటంతో పాటు అంతర్గతంగా పంపిన సమాచారాన్ని పరిశీలించినట్లు బిజినెస్ ఇన్సైడర్ స్పష్టం చేసింది. కాగా తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది లింక్డ్ఇన్, రెడిట్, బ్లైండ్ వేదికలపై తమ ఆవేదనను వెల్లడించారు.
కాగా, ఒరాకిల్‌లో ఈ ఏడాది ఉద్యోగుల తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 21 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం. ఈ తొలగింపు తర్వాత ఆర్థిక సంవత్సరం చివరినాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య సుమారు 1.41 లక్షలకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఉద్యోగుల సంఖ్య సుమారు 1.62 లక్షలుగా ఉండేది.కాగా, ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణ, ఇతర నిష్క్రమణ వ్యయాల కోసం 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ సుమారు 1.84 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది ఈ వ్యయం 374 మిలియన్ డాలర్లుగా ఉండేది. తమ రోజువారి కార్యకలాపాల్లో ఏఐని స్వీకరించడం, అమలు చేయడం కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింపునకు ఒక కారణమని ఒరాకిల్ గతంలోనే తెలిపింది.
ఇక ఉద్యోగుల తొలగింపుతో పాటు ఒరాకిల్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కూడా సంస్థపై భారీగా ఆర్థిక భారాన్ని మోపుతోంది. గత వారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పునర్వ్యవస్థీకరణకు అంచనా వేసిన మొత్తం వ్యయాన్ని మరో 700 మిలియన్ డాలర్ల వరకు పెంచింది. దీంతో 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక మొత్తం అంచనా వ్యయం సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరినట్లయింది. ఉద్యోగుల తొలగింపులకు చెల్లించే పరిహారం, ఒప్పందాల రద్దు రుసుములు, ఇతర నిష్క్రమణ వ్యయాలు అన్ని కలిపి ఇందులో ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి ఈ ప్రణాళిక కింద సుమారు 2.1 బిలియన్ డాలర్ల వ్యయాలను ఇప్పటికే నమోదు చేసినట్లు ఒరాకిల్ వెల్లడించింది. మరిన్ని పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాల్సి ఉండటంతో అదనంగా 700 మిలియన్ డాలర్లను అంచనా వ్యయంలో చేర్చినట్లు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే తాజా ఉద్యోగాల కోతలు ప్రారంభం కావడం గమనార్హం.
కాగా తాజా ఉద్యోగాల కోతలు అనుహ్యంగా తీసుకున్నవేమి కావు. ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం భారీగా అప్పులు తీసుకుంటున్న ఒరాకిల్.. అదే సమయంలో ఉద్యోగుల వేతన వ్యయాన్ని తగ్గించుకునేందుకు మరో విడత తొలగింపులకు సిద్ధమవుతోందని గత నెలలో ఇండియా టుడే డిజిటల్ నివేదికలో వెల్లడించింది. తాజా పరిణామాలతో ఆ ప్రణాళికలో కొంత భాగం అమల్లోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగుల పోస్టులను విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగించినట్లు ఈ-మెయిల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా తొలగించిన ఉద్యోగులకు అదే రోజు వారి చివరి పని దినంగా కూడా పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.









