Prajwal Revanna :  మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కేసులో మరో కీలక విషయం బయటపడింది. జైల్లో ఆయన ఉన్న సమయంలో సీసీబీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌ను ఫోరెన్సిక్‌ అధికారులు పరిశీలించారు. ఈ రెండు డివైజ్‌లలో కలిపి 250కిపైగా వీడియో క్లిప్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో పోర్న్ వీడియోలు, ఓటీటీ సిరీస్‌లు, సినిమాలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఫోరెన్సిక్‌ పరీక్షల్లో మొబైల్ ఫోన్‌లో 147 వీడియో క్లిప్స్ ఉండగా, పెన్‌డ్రైవ్‌లో 100కిపైగా వీడియోలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ వీడియోల గురించి తనకు ఏమీ తెలియదని ప్రజ్వల్ రేవణ్ణ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఫోన్‌ను ప్రధానంగా ఫోన్ కాల్స్‌ కోసం మాత్రమే ఉపయోగించానని ఆయన చెప్పినట్లు సమాచారం. జైల్లో ఉన్న ఖైదీల మధ్య ఆ మొబైల్ ఫోన్‌ను ఒకరి తర్వాత మరొకరు ఉపయోగించేవారని ప్రజ్వల్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అందువల్ల ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ఎవరు డౌన్‌లోడ్ చేశారో తనకు తెలియదని ఆయన చెప్పినట్లు సమాచారం.

తన తల్లితో మాట్లాడిన విషయాన్ని మాత్రం ప్రజ్వల్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తల్లి నంబర్‌కు నేరుగా కాకుండా, ఆమె దగ్గర పనిచేసే ఓ మహిళ ఉపయోగించే ఫోన్‌ ద్వారా మాట్లాడినట్లు చెప్పినట్లు సమాచారం. అలాగే ఓ మహిళా స్నేహితురాలితో కూడా మాట్లాడినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న సమయంలో సాధారణ ఫోన్ కాల్స్‌తో పాటు వీడియో కాల్స్‌ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Also Read : బ్రిక్స్ వేదికగా చైనాకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రస్తుతం పోలీసులు ఆ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్‌ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో గుర్తించి, అవసరమైతే వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్‌ను అసలు ఎవరు ఉపయోగించారు? ఎలాంటి కాల్స్‌ చేశారు? అనే విషయాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.

జైల్లోకి ఫోన్‌ చేరేందుకు ప్రజ్వల్‌ రేవణ్ణ సుమారు రూ.లక్ష చెల్లించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఫోన్‌ను పలువురి ద్వారా ఆయనకు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో జైలు సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. మొబైల్‌ ఫోన్‌లోని డేటాతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. జైల్లో వివిధ సమయాల్లో ఆ ఫోన్‌ను ఎవరు ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు, ఫోన్‌ ప్రజ్వల్‌ వద్దకు ఎలా చేరింది అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్‌ రేవణ్ణ సంబంధించినట్లు చెబుతున్న అశ్లీల వీడియోలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పెద్ద రాజకీయ దుమారం రేగింది.మహిళలపై లైంగిక దాడి చేసి, వాటిని వీడియోల్లో రికార్డు చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు లైంగిక వేధింపుల కేసులు ఆయనపై నమోదయ్యాయి.

వీడియోల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లారు. ఆయనను విచారణకు హాజరు కావాలని అధికారులు కోరారు. చివరకు 2024 మే 31న జర్మనీ నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చినప్పుడు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో SIT అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనపై నమోదైన కేసుల్లో ఒకదానిలో కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది.

Also Read : పుతిన్, జిన్‌పింగ్‌లతో మోదీ భేటీ.. న్యూఢిల్లీ వేదికగా బ్రిక్స్ 2026 ప్రారంభం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.