Nandigram :  పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీలోని తిరుగుబాటు నేతలు కీలక ప్రకటన చేశారు. మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తే.. తమ వర్గం తరఫున అభ్యర్థిని నిలబెట్టబోమని చెప్పారు. దీంతో టీఎంసీలోని రెండు వర్గాల మధ్య మళ్లీ కలిసే అవకాశం ఉందా? లేక ఇది మమతకు విసిరిన సవాలా? అనే చర్చ మొదలైంది.

టీఎంసీ తిరుగుబాటు వర్గం నేత రితబ్రత బెనర్జీ ఢిల్లీలో మాట్లాడారు. తమ వర్గం తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయిందని, అయితే ఆ పేరును ఇంకా ప్రకటించలేదని చెప్పారు. అదే సమయంలో మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మమత సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి గెలవలేదని రితబ్రత గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు మమత సొంత నియోజకవర్గం భబానీపూర్‌లోనూ ఆమెను ఓడించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మమత 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది.

Also Read : బ్రిక్స్ వేదికగా చైనాకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

మమతా బెనర్జీ అసెంబ్లీకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి నందిగ్రామ్‌కు రండి. మేము అభ్యర్థిని పెట్టం. గెలిచి అసెంబ్లీకి రండి. కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం అని టీఎంసీ తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్‌ అన్నారు. మమతా బెనర్జీకి నందిగ్రామ్‌తో పాత అనుబంధం ఉంది. అక్కడ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆమె పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం తర్వాతే 2011లో పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల పాలనకు ముగింపు పలికి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మాత్రం మమత ఓడిపోయారు. ఆ తర్వాత భబానీపూర్‌ నుంచి ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలోకి వచ్చారు.

ఇప్పుడు నందిగ్రామ్‌ ఎమ్మెల్యే పదవి ఖాళీ కావడంతో అక్టోబర్‌ 6న అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మమత నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై మమతా బెనర్జీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా టీఎంసీలో విభేదాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు మమతకు దూరమయ్యారు. ఆమె మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కారణంగానే పార్టీకి నష్టం జరిగిందని వారు ఆరోపించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత టీఎంసీకి చెందిన పలువురు ఎంపీలు కూడా మమతకు దూరమయ్యారు.

అయితే మమతతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య లేదని తిరుగుబాటు నేతలు చెబుతున్నారు. తమ అసంతృప్తి ప్రధానంగా అభిషేక్‌ బెనర్జీపై ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. నందిగ్రామ్‌తో పాటు రెజినగర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.

Also Read : త్రిషతో లండన్ లో సీఎం విజయ్ చక్కర్లు.. ఫోటోలు వైరల్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.