ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో డిజిటల్ సేవల కేటాయింపు, నిర్వహణపై ఓ దినపత్రికలో వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ అధికారికంగా స్పందించారు. “ఆలయాల్లో ‘సాఫ్ట్’గా దోపిడీ!” అనే శీర్షికతో ప్రచురితమైన ఆ వార్తా కథనం పూర్తిగా అవాస్తవమని, ఆధారాలు లేని ప్రచారమని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను, శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఈ అసత్య కథనాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆలయాలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలు, ఆర్జిత సేవల బుకింగ్స్, దర్శనం టికెట్లు, విరాళాల నిర్వహణ అత్యంత సున్నితమైన అంశాలని దేవదాయ శాఖ తెలిపింది. భక్తుల చెల్లింపులు, వ్యక్తిగత సమాచారం, ఆలయ ఆదాయ లెక్కల భద్రత కోసం ప్రభుత్వ అధికారిక నోడల్ సాంకేతిక సంస్థ అయిన ‘ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్’ (APTS) సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుందని పేర్కొంది.

Also Read : బ్యాంకులో కారం పొడి చల్లి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లాడు.. 30 నిమిషాల్లోనే పోలీసుల షాక్!

వివిధ రకాల ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ఉపయోగించడం వల్ల సమాచార భద్రత దెబ్బతినడం, సైబర్ దాడులు జరగడం, డేటా లీకేజీ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. ఈ సమస్యలను నివారించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఒకే రకమైన, సురక్షితమైన ఏకీకృత డిజిటల్ గవర్నెన్స్ సిస్టమ్‌ను అమలు చేసే బాధ్యతను ఏపీటీఎస్‌కే అప్పగించినట్లు తెలిపారు.

కొందరు అధికారుల బంధువులకు లేదా నిర్దిష్ట వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికే సాఫ్ట్‌వేర్‌ను మార్చారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి స్వప్రయోజనాలు లేదా రాజకీయ కుమ్మక్కులకు తావులేకుండా కేవలం ప్రభుత్వ నియమావళి, పారదర్శక ప్రమాణాల మేరకే ఈ నిర్ణయాలు జరిగాయని పేర్కొంది. ఏపీటీఎస్ సేవలకు కేటాయిస్తున్న నిధుల వినియోగం అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆడిట్ ప్రక్రియకు లోబడే జరుగుతోందని, భక్తుల సొమ్ము దుర్వినియోగం అవుతోందనడం అపోహ మాత్రమేనని నివేదించింది.

గతంలో ఉన్న సాంకేతిక లోటుపాట్లను అధిగమించి, కఠినమైన ఐటీ సెక్యూరిటీ నిబంధనలు, డిజిటల్ లాగ్స్, ట్యాంపర్ ప్రూఫ్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌తో ఏపీటీఎస్ ద్వారా సేవలను అత్యంత సురక్షితంగా పునరుద్ధరించామని కమిషనర్ తెలిపారు. దేవదాయ శాఖ ఆలయాల డిజిటలైజేషన్‌లోనూ, భక్తులకు పారదర్శకమైన సేవలు అందించడంలోనూ పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని, పత్రికా విలువలకు లోబడి ఈ రీజాయిండర్‌ను ప్రాధాన్యతతో ప్రచురించాలని కోరారు.

Also Read : నేపాల్ వరదల్లో ఊహించని అద్భుతం.. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ చైనా కార్మికుడు!