
– RAVI PRAKASH
CASE OF AKRITI CHAUDHARY : ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పునకు ఎవరు మూల్యం చెల్లించాలి? దేశంలో ఇప్పుడు ఒక అసమాన విషయం జరిగింది. ఒక యువ నిరసనకారురాలికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఆమెను జాతీయ భద్రతా చట్టం (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ — NSA) కింద దాదాపు ఐదు నెలలు జైల్లో పెట్టారు. అంతేకాదు ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించమని కోర్టు చెప్పలేదు. బాధ్యులైన అధికారుల జీతాల నుంచి ఈ డబ్బును రివకరీ చేయాలని ఆదేశించింది. ఆమె నిర్బంధానికి ఆదేశాలు ఇచ్చినవారిలో జిల్లా కలెక్టర్ ఉన్నారు.కానీ ఇప్పుడు ఈ కేసు ఒక్కసారిగా జాతీయ వార్త ఎందుకు అయింది? ఆ జిల్లా మేజిస్ట్రేట్ ఎవరు?మేధా రూపమ్. మేధా రూపమ్ ఎవరి కుమార్తె? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె. అవును. దేశ ఎన్నికల వ్యవస్థకు అధిపతిగా ఉన్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె. ఆమె కూడా ఐఎఎస్ అధికారి. ఇప్పుడు ఒక హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. ఆమె జీతం నుంచే నష్టపరిహారం వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది.కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి.
Also Read : గ్రీన్‌ల్యాండ్, కెనడా మావే.. బాంబ్ పేల్చిన ట్రంప్..!
ఇది మేధా రూపమ్ ఎవరి కూతురు అనే కథ కాదు. అసలు ప్రశ్న అంతకంటే చాలా పెద్దది. ఒక అధికారికి ప్రభుత్వం ఇచ్చిన అధికారానికి పరిమితులు ఏమిటి? ఆ అధికారాన్ని ఉపయోగించి ఒక పౌరుడి స్వేచ్ఛను లాక్కుంటే ఆ తర్వాత కోర్టు వచ్చి ఈ అధికారాన్ని మీరు తప్పుగా ఉపయోగించారని చెబితే ఆ అధికారికి ఏమీ కాదా? అన్నీ మర్చిపోయి ముందుకు వెళ్లిపోవచ్చా? ఇదే అసలు ప్రశ్న.ఆకృతి చౌధరిని ఎన్ఎస్ఏ కింద నిర్బంధంలో పెట్టారు. దాదాపు ఐదు నెలలు ఆమె జైల్లో ఉన్నారు. నోయిడా కార్మికులు నిరసనల్లో జరిగిన హింసతో ఆమెకు సంబంధం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. కానీ హైకోర్టు ఆధారాలు అడిగినప్పుడు… ఆమె హింసకు రెచ్చగొట్టిన వీడియో ఎక్కడ? ఆమె పంపిన సందేశం ఎక్కడ? ప్రజలను రాళ్లు రువ్వమని , వాహనాలను తగలబెట్టమని ఆమె చెప్పిన ఆధారాలు ఎక్కడ? ఆ ఆరోపణలను రుజువు చేసే స్థాయిలో ఆధారాలను కోర్టు ముందు ప్రభుత్వం చూపించలేకపోయింది.దాంతో హైకోర్టు ఎన్ఎస్ఏ నిర్బంధాన్ని కొట్టివేసింది. అంతే కాదు అప్పుడు వచ్చింది ఈ మొత్తం కేసులోనే అత్యంత అసాధారణమైన భాగం . 5 లక్షల రూపాయల నష్టపరిహారం . అది కూడా కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి కాదు. బాధ్యులైన అధికారుల సొంత జీతాల నుంచి. వారి సర్వీస్ రికార్డ్స్ లో కూడా ఈ విషయాలను నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడు ఒక్కసారి నోయిడాని పక్కన పెట్టండి. ఉత్తర ప్రదేశ్‌ను పక్కన పెట్టండి. రాజకీయాన్ని కూడా పక్కన పెట్టండి. ఒక్క ప్రశ్న మీరే వేసుకోండి. ప్రభుత్వం మీ స్వేచ్ఛను తీసుకుంది… తర్వాత కోర్టు వచ్చి… ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పింది అనుకోండి. మరి మీ జీవితంలో తిరిగి రాని ఆ ఐదు నెలలకు ఎవరు సమాధానం చెబుతారు? ఇవాళ ఇలా ఐదు నెలలు కోల్పోయింది ఆకృతి చౌదరి. రేపు ఆ స్థానంలో ఇంకెవరైనా ఉండొచ్చు. విద్యార్థి , రైతు, కార్మికుడు, జర్నలిస్టు ఇలా మనలో ఎవరో ఒకరు కావచ్చు.అందుకే ఈ తీర్పును కేవలం యూపీ స్టోరీ చూడకూడదు. ఇది ఒక్క అమ్మాయి కథ కాదు. ఒక్క కలెక్టర్ కథ కాదు. ఒక్క ప్రభుత్వం కథ కాదు. ఇది పౌరుడు వర్సెస్ ప్రభుత్వం కథ. మరి అసలు ప్రశ్న… ప్రభుత్వం తప్పు చేస్తే… ఆ తప్పునకు మూల్యం ఎవరు చెల్లించాలి?
ఇక్కడే ఆకృతి చౌధరి కేసు నోయిడాని దాటి చాలా పెద్ద కథగా మారుతుంది. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు కేవల ఆమెను విడుదల చేయండి అని మాత్రమే చెప్పలేదు. అసలు ప్రభుత్వం తన అధికారాన్ని ఎలా ఉపయోగించింది? ఎందుకు ఉపయోగించింది? ఆ అధికారాన్ని ఉపయోగించడానికి సరైన ఆధారం ఉందా? అన్న ప్రశ్నలు సంధించింది.ఆకృతిపై ప్రభుత్వం సమర్పించిన నివేదికను/సమాచారాన్ని కోర్టు పరిశీలించింది. ఆ ఆధారాల్లో అంచనాలు,ఊహగానాలు ఎక్కువగా ఉన్నాయని, చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పారని, నమ్మదగిన ఆధారాలు ఏ మాత్రం లేవని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.అల్లర్లు చేసేలా ప్రజలను ఆకృతి రెచ్చగొట్టిందని చెబుతున్నారు. వాహనాలు తగలబెట్టమని చెప్పిందంటున్నారు. రాళ్లు వేయమని ప్రోత్సహించింది అంటున్నారు. అయితే… ఆమె అలా చెబుతున్న వీడియో ఎక్కడ? సందేశం ఎక్కడ? ఆమె హింసకు పిలుపునిచ్చిన ఒక్క నమ్మదగిన ఆధారం ఎక్కడ? అని కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో ఆధారాలు చూపించలేకపోయింది.ఇంకా షాకింగ్ పరిశీలన ఏంటంటే… ఒక యువ విద్యార్థి ఉద్యమకారిణిని ఉదాహరణగా మార్చాలన్న ఉద్దేశంతోనే జిల్లా మేజిస్ట్రేట్ వ్యవహరించినట్టుగా కోర్టు గమనించింది. అంటే… ఒకరిని కఠినంగా శిక్షిస్తే మిగతావాళ్లు నిరసన తెలపడానికి మాట్లాడటానికి భయపడతారని!
Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!
ఒక్కసారి ఆలోచించండి! ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించేది ఇందుకోసమా? ఒక పౌరుడిని ఉదాహరణగా చూపించడానికా? మిగతావాళ్లను భయపెట్టి మౌనంగా చేయడానికా? రాజ్యాంగం ప్రభుత్వానికి) చాలా అధికారాలు ఇస్తుంది. కానీ… ఆ అధికారంతో పాటు బాధ్యతను కూడా ఇస్తుంది. ఇంకా ఒక ప్రాథమిక విషయాన్ని కోర్టు అధికారులకు గుర్తు చేసింది. మీ విధేయత ఉండాల్సింది రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి కాదు రాజ్యాంగానికి . మీరు పాలకులు కాదు. మీరు ప్రజా సేవకులు . పౌరులు మీ పాలిత ప్రజలు కాదు. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? పౌరుల కోసం. వాళ్లకు సేవ చేయడానికి పనిచేయాలి!కానీ కోర్టు ఇక్కడితో ఆగలేదు. ఇలాంటి నిరంకుశ ప్రవర్తన అధికారుల్లో కొనసాగితే ఉత్తర ప్రదేశ్ ఒక భయానక నియంతృత్వ రాజ్యంగా మారే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది. ఇప్పుడు ఆ మాట అర్థం చేసుకోండి. ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ చెబుతున్న మాట కాదు. ఎవరో ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణ కాదు. ప్రభుత్వానికి ఉన్న అపరిమితమైన అధికారం ఎటువైపు తీసుకెళ్లగలదో కోర్టు వార్నింగ్ ఇచ్చింది.
అందుకే ఈ కేసు ప్రతి భారతీయుడికి ముఖ్యమైనది. ఈరోజు ఒక విద్యార్థి , కార్మికులకు మద్దతు ఇచ్చింది . రేపు ఒక రైతు, ఒక విలేకరి ,ఒక కార్మిక సంఘ నాయకుడు , ఒక ఉద్యమకారుడు లేదా… తన గొంతు వినిపించాలని నిర్ణయించుకున్న ఒక సాధారణ పౌరుడు మాట్లాడినందుకు జైలు శిక్ష పడటం మొదలైతే అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన సంకేతం.అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న శాంతియుత నిరసన ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు (రైట్) అయితే శాంతిభద్రతలను కాపాడుతున్న ప్రభుత్వం ఎప్పుడు భిన్నాభిప్రాయాన్ని అణచివేసే ప్రభుత్వంగా మారుతుంది? ఆ గీత ఎక్కడ గీస్తాం?ఇక ఈ తీర్పులో నాకు అన్నింటికంటే ముఖ్యమైనదిగా అనిపించిన విషయం ఒకటుంది. కోర్టు ఒక గీత గీసింది. ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించాలి . హింస జరిగితే పోలీసు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిజంగా హింసకు పాల్పడతారో వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ శాంతియుత నిరసన మాత్రం నేరంగా మారకూడదు. ఎందుకంటే రాజ్యాంగం మనకు వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. మన మాట చెప్పుకునే హక్కు ఉంది. బహిరంగ ప్రదేశంలోకి వచ్చి శాంతియుతంగా గుమికూడే హక్కు ఉంది. ఒక లక్ష్యం కోసం మన గొంతు ఎత్తే హక్కు ఉంది.
అందుకే శాంతియుత నిరసనను సమాజానికి ఒక సేఫ్టీ వాల్వ్) లాంటిదని కోర్టు చెప్పింది. ఇది భారతదేశానికి కోర్టు ఇచ్చిన చాలా ముఖ్యమైన సందేశం. ఎందుకంటే ప్రభుత్వంతో అందరూ ఏకీభవించినప్పుడు ప్రజాస్వామ్యానికి పరీక్ష కాదు. పౌరులు ప్రభుత్వంతో విభేదించినప్పుడే ప్రజాస్వామ్యం పరీక్షను ఎదుర్కొంటుంది.
అందుకే ఈ కథను నోయిడాకే పరిమితం చేయకూడదు. ఒక్కసారి రాజకీయ పార్టీని పక్కన పెట్టండి. ఉత్తర ప్రదేశ్‌ను పక్కన పెట్టండి. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారన్నది కూడా పక్కన పెట్టండి. ఇది మీకు జరిగితే? మీరు మీ గొంతు ఎత్తారు . ఒక నిరసనలో పాల్గొన్నారు. కార్మికులకు మద్దతు ఇచ్చారు . రైతులకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రశ్నించారు. అంతే.
ఒక్కసారిగా ప్రభుత్వం మిమ్మల్ని ఒక “ముప్పుగా” చూస్తే? అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అందుకే ఈ తీర్పు అంత ముఖ్యమైనది . ఎందుకంటే ప్రభుత్వానికి అపారమైన అధికారం (పవర్) ఉంటుంది. కానీ… ఆ అధికారానికి రాజ్యాంగం హద్దులు పెడుతుంది.
ఈ తీర్పులో నాకు అత్యంత శక్తివంతమైన సందేశంగా అనిపించింది. అది ఆ 5 లక్షల నష్టపరిహారం కాదు. ఒక పౌరుడు ప్రభుత్వం ముందు నిస్సహాయుడు కాడు. రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. మరి అధికారాన్ని బాధ్యతారాహిత్యంగా ఉపయోగిస్తే..? దానికి పరిణామాలు కూడా ఉండాలి.
ఆకృతి చౌధరి జీవితంలో కోల్పోయిన ఆ ఐదు నెలలు తిరిగి రావు. 5 లక్షల రూపాయలు ఆ ఐదు నెలలను తిరిగి ఇవ్వలేవు. కానీ… ఈ తీర్పు తర్వాత ఏ అధికారి (ఆఫీసర్) అయినా మరొక పౌరుడి స్వేచ్ఛను హరించే ముందు ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఐదు నెలలు ఏదో ఒక మార్పు తీసుకొచ్చినట్టే. ఎందుకంటే చివరికి ఇది కేవలం ఆకృతి కథ మాత్రమే కాదు. ఇది ప్రతి భారతీయుడి కథ!
ఇక్కడ ప్రశ్న.. “ప్రభుత్వం ఎవరిది?” అనేది కాదు. అసలు ప్రశ్న “ప్రభుత్వం తప్పు చేసినప్పుడు… పౌరుడిని ఎవరు కాపాడతారు? బహుశా ఈ తీర్పు ఆ ప్రశ్నకు సమాధానానికి ఒక ఆరంభంగా పనికొస్తుంది. అధికారానికి హద్దులు ఉండాలి. బాధ్యతాయుత స్థానానికి జవాబుదారీతనం ఉండాలి. అన్నింటికంటే… రాజ్యాంగమే ప్రభుత్వం కంటే ఎప్పుడూ పెద్దదిగా ఉండాలి









