Salakatla Brahmotsavam 2026 Dates :తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇలా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనికి కారణం అధికమాసం రావడమే. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సాధారణంగా భాద్రపద మాసంలో నిర్వహిస్తుంటారు. అసలైన బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా జరుగుతుంటాయి. ఇంతకీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మధ్య గల ముఖ్యమైన తేడాలు ఏంటో తెలుసా?

సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ బ్రహ్మోత్సవాలు భాద్రపద మాసంలో జరుగుతాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమవడమే కాకుండా చివరి రోజు ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగుస్తాయి.

నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సమయంలో జరుపుతారు. అయితే ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం వంటివి ఉండవు. అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే పెద్ద కట్టె రథం అంటే రథోత్సవం బదులుగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి వారు బంగారు రథంపై భక్తులకు దర్శనమివ్వడం ప్రత్యేకత.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచంటే?
2026 సంవత్సరంలో అధిక మాసం రావడం మూలంగా సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తిరిగి అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరురుతారు. భక్తులు ఈ రెండు ఉత్సవాల్లోనూ మలయప్ప స్వామి వారి వివిధ వాహన సేవలను దర్శించుకోవడానికి అవకాశం ఉంది.

కనులవిందుగా రెండు బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది రెండు సార్లు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏ రోజు ఏ వాహనసేవలు ఉంటాయంటే..?

సెప్టెంబరు 08, మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 14, సోమవారం రోజున రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది.
సెప్టెంబర్ 15, మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు.

దేవతలకు ఆహ్వానం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో మొదలవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేయడం ఆనావాయితీ. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లవుతుంది.

ఏ రోజు ఏ వాహనసేవ?
ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం చాలా గొప్పగా ఉంటుంది

సెప్టెంబర్ 15, మంగళవారం రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనం ఉంటుంది.
సెప్టెంబర్ 16, బుధవారం ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారు చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక రాత్రి 7 గంటలకు శ్రీవారు హంస వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు.
సెప్టెంబర్ 17, గురువారం ఉదయం 8 గంటలకు శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారు. అదే రోజు రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 18, శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారు సర్వభూపాల వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
సెప్టెంబర్ 19, శనివారం ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన గరుడ వాహనంపై శ్రీవారు తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 20, ఆదివారం ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు అనుగ్రహిస్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు గజ వాహనంపై శ్రీవారు తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తారు.
సెప్టెంబర్ 21, సోమవారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శన మిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారు చంద్రప్రభ వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహ భాగ్యం కలిగిస్తారు.
సెప్టెంబర్ 22, మంగళవారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారి రథోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారు అశ్వవాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శన మిస్తారు.
సెప్టెంబర్ 23, బుధవారం రోజు శ్రవణా నక్షత్రం సందర్భంగా పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుపుతారు. ధ్వజావరోహణం ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఈ బ్రహ్మోత్సవాలలో తనను దర్శించిన వారిని ఆ శ్రీనివాసుడు అనుగ్రహించి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ ఉత్సవాల సందర్భంగా భగవంతుని సేవలో, భక్తుల సేవలో తరించేవారి అభీష్టాలను ఆ శ్రీనివాసుడు త్వరితంగా తీరుస్తాడని పురాణాల్లో ఉందని చెబుతారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.