TVK-Congress Alliance : తమిళనాడు రాజకీయాల్లో అనుహ్యాంగా తెరమీదకు వచ్చి తక్కువ సమయంలోను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ నేతృత్వంలోని రాజకీయ కూటమికి అధికారికంగా ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ (Secular Social Justice Victory Alliance) అనే పేరు పెట్టారు. విజయ్ నేతృత్వంలోని TVKతో పాటు కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) తదితర ఐదు పార్టీలు ఈ కూటమిలో భాగంగా ఉండనున్నాయి.

కాగా, కూటమి పేరును ఖరారు చేసేందుకుగాను బుధవారం చెన్నైలోని పనైయూర్‌లో ఉన్న TVK ప్రధాన కార్యాలయంలో భాగస్వామ్య పార్టీల నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, VCK, MDMK, IUML పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ తరఫున మాణిక్కం ఠాగూర్, తారగై కాథ్‌బర్ట్, ప్రవీణ్ చక్రవర్తి, VCK తరఫున పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ తో పాటు వన్ని అరసు, రవి కుమార్, సిందనై సెల్వన్ , MDMK తరఫున పార్టీ నేత వైకోతో పాటు దురై వైకో , IUML నుంచి కే.ఎం. కాదర్ మొహిదీన్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూటమి పేరుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరును అధికారికంగా ఖరారు చేశారు.

Also Read : ఉబెర్‌ కీలక నిర్ణయం..ఇక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు బ్రేక్‌ ?

కాగా, ఈ కూటమిలోని ప్రధాన పార్టీలకు సెక్యులరిజం, సామాజిక న్యాయం వంటి అంశాలపై బలమైన రాజకీయ వైఖరి ఉందని. అందుకే అదే అంశాలను ప్రతిబింబించేలా కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ అనే పేరు పెట్టినట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు రాజకీయాల్లో ఈ కూటమి రాబోయే ఎన్నికల పోరులో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. TVK ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది, మరోవైపు కాంగ్రెస్, VCK, MDMK, IUML వంటి పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

కాగా, ఇన్నాళ్లు వేర్వేరు పార్టీలుగా టీవీకేకు మద్ధతు ఇస్తూ వచ్చిన పార్టీలు కూటమి పేరును అధికారికంగా ఖరారు చేయడం ద్వారా భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఏర్పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రం కానున్నది. ఈ నేపథ్యంలో, విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ పేరుతో ఎన్నికల బరిలోకి దిగనున్న ఈ కూటమి.. తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపనుందో ముందు ముందు తేలనుంది.

Also Read : బుక్‌మైషోలో మోదీ ఈవెంట్‌కు ఫుల్ డిమాండ్.. గంటలోనే సీట్లు ఖాళీ!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.