Cognizant :  అమెరికాలో కాగ్నిజెంట్ కంపెనీకి షాక్ తగిలింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు ఇప్పించేందుకు ఆ కంపెనీ చేస్తున్న దరఖాస్తులను అమెరికా కార్మిక శాఖ నిలిపివేసింది. కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో ఏమైనా మోసం జరిగిందా? అమెరికా ఉద్యోగులకు ఏమైనా నష్టం జరిగిందా? అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగ్నిజెంట్‌కు సంబంధించిన PERM దరఖాస్తులను నిలిపివేసింది అక్కడి గవర్నమెంట్,

అయితే కాగ్నిజెంట్‌పై ఏ ఆరోపణలు ఉన్నాయో అధికారులు ఇంకా చెప్పలేదు. ఎన్ని దరఖాస్తులు ఆగిపోయాయి? ఈ నిర్ణయం ఎంతకాలం ఉంటుంది? అనే విషయాలు కూడా వెల్లడించలేదు. ఈ కేసులో అమెరికా కార్మిక శాఖతో పాటు వైట్ హౌస్‌కు చెందిన మోసం నిరోధక బృందం కూడా విచారణ చేస్తోంది. కాగ్నిజెంట్‌తో పాటు మరో టెక్నాలజీ కంపెనీ క్లౌడెరా గ్రీన్ కార్డ్ దరఖాస్తులను కూడా అధికారులు నిలిపివేశారు.

Also Read : సింగపూర్ ప్రధానికి కళ్లు చెదిరే జీతం.. ట్రంప్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువ!

అయితే ఈ రెండు కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై కాగ్నిజెంట్, క్లౌడెరా కూడా వెంటనే స్పందించలేదు. మరోవైపు, ఈ నిర్ణయానికి ఒక రోజు ముందే కాగ్నిజెంట్ అమెరికాలో కొత్త ఉద్యోగాలపై ప్రకటన చేసింది. అమెరికా కాలేజీల్లో చదువు పూర్తి చేసిన 1,500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపింది.

అలాగే కొత్త ఏఐ ఉద్యోగాలను పెంచుతామని కంపెనీ చెప్పింది. తమ కొత్త ఉద్యోగ విభాగాల్లో మొత్తం 15 వేల మందికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గడం కంటే కొత్త ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని ఆయన చెప్పారు.

కాగ్నిజెంట్ అమెరికా ఉద్యోగులకు ఏఐపై శిక్షణ కూడా ఇస్తోంది. కంపెనీకి చెందిన Synapse కార్యక్రమం ద్వారా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా శిక్షణ పొందారు. 2030 నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే దరఖాస్తుల్లో ముందుగా అమెరికా కార్మిక శాఖ కొన్ని విషయాలు చూస్తుంది. ఆ ఉద్యోగానికి అర్హత ఉన్న అమెరికా వ్యక్తులు అందుబాటులో ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తుంది. విదేశీ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటే అమెరికా ఉద్యోగులకు నష్టం కలగకూడదని కూడా చూస్తుంది.

Also Read : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. అమెరికాపై కెనడా భారీ టారిఫ్‌లు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.