
Kavitha Kalvakuntla : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుకుంటున్నానంటూ కామెంట్స్ చేసిన షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై టీఆర్ఎస్ చీఫ్, కేసీఆర్ కుమార్తె కవిత ఎక్స్ వేదికగా ఆ ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప చావు కోరుకోవడం ఏమిటి? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదని ఆమె అన్నారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు? అని కవిత ప్రశ్నించారు. అంటే ఆయన దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అంటూ నిలదీశారు.
ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటీ? ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ఉసిగొల్పడం ఏమిటి? అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తోందని ఆమె ప్రశ్నించారు. అనేక సమస్యలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉంటే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు రోజులుగా విలువైన సభా సమయాన్ని వృథా చేశాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుండయినా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కవిత సూచించారు.









