
ఈ రోజుల్లో పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కావాలంటే బ్యాంకులు ముందుగా చూసేది మీ క్రెడిట్ స్కోర్(CIBIL Score). మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు ఇస్తాయి. కానీ గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ స్కోర్ పడిపోయిందా? లోన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? అయితే అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. కేవలం ఆరు నెలల్లోనే మీ క్రెడిట్ స్కోర్‌ను ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
Also Read : ఎండుచేపల లవర్స్‌కు అలర్ట్.. టేస్ట్‌లో సూపర్ కానీ.. అతిగా తింటే ఆసుపత్రిలో బెడ్ తప్పదు!
ఆలస్యం వద్దు
క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణం ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు నిర్ణీత గడువులోగా చెల్లించకపోవడమే. మీ క్రెడిట్ హిస్టరీలో 35% ప్రభావం మీరు ఇచ్చే సకాలపు చెల్లింపులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి నెల మీ బిల్లులను డ్యూ డేట్ కంటే ముందే చెల్లించడం అలవాటు చేసుకోండి. ఇందుకోసం మీ బ్యాంక్ ఖాతాలో ‘ఆటో డెబిట్’ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం లేదా క్యాలెండర్‌లో రిమైండర్‌లు పెట్టుకోవడం చాలా మంచిది.
లిమిట్ దాటకూడదు
మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డ్ పరిమితి ఎంత ఉంటే అంత వాడటం చాలా పెద్ద తప్పు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.1 లక్ష ఉంటే అందులో 30% అంటే కేవలం రూ. 30,000 వరకు మాత్రమే వాడటానికి ప్రయత్నించండి. మీరు ప్రతీ నెలా కార్డ్ లిమిట్ మొత్తాన్ని వాడేస్తుంటే బ్యాంకులు మిమ్మల్ని ‘ఆర్థికంగా క్రమశిక్షణ లేని వ్యక్తి’గా లేదా ‘క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడే వ్యక్తి’గా భావిస్తాయి. దీనివల్ల మీ స్కోర్ దెబ్బతింటుంది.
పాత క్రెడిట్ కార్డులను అస్సలు క్లోజ్ చేయకండి
చాలామంది ఇక వాడటం లేదని చెప్పి పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తుంటారు. కానీ పాత క్రెడిట్ కార్డులు ఉన్న కొద్దీ మీ ‘క్రెడిట్ హిస్టరీ ఏజ్’ పెరుగుతుంది. ఎంత సుదీర్ఘమైన క్రెడిట్ రికార్డ్ ఉంటే, క్రెడిట్ బ్యూరోలు మిమ్మల్ని అంతగా నమ్ముతాయి. అందుకే పాత కార్డులపై ఎలాంటి వార్షిక రుసుము లేకపోతే వాటిని యాక్టివ్‌గా ఉంచడమే మీ స్కోర్‌కు బెటర్.
ఒకేసారి అనేక లోన్లకు అప్లై చేయకండి
మీకు డబ్బు అవసరం ఉందని ఒకేసారి 4-5 బ్యాంకులు లేదా డిజిటల్ యాప్‌లలో లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయకూడదు. మీరు అప్లై చేసిన ప్రతిసారీ ఆ బ్యాంక్ మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేస్తుంది. దీన్ని ‘హార్డ్ ఎంక్వైరీ’ అంటారు. స్వల్ప వ్యవధిలో ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు జరిగితే మీ స్కోర్ పడిపోతుంది. లోన్ అవసరం ఉంటే ఒకే బ్యాంకును సంప్రదించడం మంచిది.
Also Read : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం!
తప్పులను సవరించుకోండి
కొన్నిసార్లు మీరు బిల్లులు కట్టినా, బ్యాంక్ లేదా క్రెడిట్ బ్యూరోల వైపు నుంచి జరిగిన సాంకేతిక లోపాల వల్ల మీ రిపోర్ట్‌లో డిఫాల్టర్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి మీ సిబిల్, ఎక్స్‌పీరియన్ లేదా సిఫిల్ రిపోర్ట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని సరి చూసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే క్రెడిట్ బ్యూరోకు డిస్ప్యూట్ రైజ్ చేసి సవరించుకోండి. దీనివల్ల రాత్రికి రాత్రే స్కోర్ పెరిగే అవకాశం ఉంది.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించండి
మీ సిబిల్ స్కోర్ బాగా తక్కువగా ఉండి ఏ బ్యాంకు కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వకపోతే బ్యాంక్‌లో చిన్న డిపాజిట్ చేసి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఈ కార్డ్‌ను క్రమం తప్పకుండా వాడుతూ, బిల్లులు సరిగ్గా చెల్లిస్తే కేవలం 6 నెలల వ్యవధిలోనే మీ క్రెడిట్ స్కోర్ మళ్లీ పెరుగుతుంది.









