Food safety raids: ఒక్కోసారి మనల్ని మన కళ్లే మోసం చేయవచ్చు. అవును మన కంటికి కనిపించే పదార్థాలన్నీ నిజమైనవి కాకపోవచ్చు. కానీ, కళ్లకు మాత్రం సాధారణంగానే కనిపిస్తాయి. కానీ, అసలు విషయం అవి తిన్న తర్వాతే తెలుస్తోంది. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది మనం తీసుకునే పదార్థాల విషయం. తాజాగా హైదరాబాద్‌లోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై తెలంగాణ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

నగరంలోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్(తెలంగాణ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ఈ దాడులు నిర్వహించింది. నగరంలోని మొత్తం 14 తయారీ కేంద్రాల్లో మొత్తం 12 బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఫుడ్‌ సేఫ్టీ, పోలీసులు, హెచ్‌ ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా చేసిన ఈ సోదాల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా డెయిరీ కేంద్రాలలో అసలు పాలు లేకుండానే రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలుసుకుని అవక్కాయ్యారు. పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వంటి రసాయన పదార్థాలను అధిక మొత్తంలో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత లోపించినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూ.7.19 లక్షల విలువైన ఆహార పదార్థాలు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కల్తీకి పాల్పడుతున్నారన్న అనుమానంతో 21 ఆహారపదార్థాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. కల్తీ ఆహారపదార్థాలు ఉత్పత్తి చేస్తున్న మూడు డెయిరీ యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పలు తయారీ కేంద్రాలు కనీస ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాంటి ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యం పాడు కావడం గ్యారంటీ అని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.