
Sachin Tendulkar : ఉపాధ్యాయ దినోత్సవం అనగానే అందరూ తమకు విద్య నేర్పించిన గురువులను గుర్తు చేసుకుంటారు. మరికొంతమంది తమ తండ్రులనే గురువులుగా భావించి వారి సేవలను గుర్తు చేసుకుంటారు. తాజాగా భారతీయ క్రికెట్‌దిగ్జజం సచిన్ టెండూల్కర్ తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ తెండూల్కర్‌ను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన జ్ఞాపకార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ తెందుల్కర్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) చేసే ఒక విద్యార్థికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యువ డాక్టర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంగా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి తెండూల్కర్ ఫౌండేషన్ ఈ ఫెలోషిప్‌ను ఇవ్వడానికి సిద్ధపడింది. దీనికోసం శ్రీనగర్‌లోని క్లెఫ్ట్, క్రానియోఫేసియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ కోసం ఏటా ఎండీ చేసే ఒకరిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.
Also Read : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఇండస్‌పై భారత్ తొలి చెక్‌డ్యామ్!
యువ వైద్యుల కోసం ‘ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్’ను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) ద్వారా ప్రకటించినున్నట్లు తెలిపారు. శ్రీనగర్‌లోని క్లఫ్ట్ (పెదవి చీలిక), క్రానియోఫేషియల్ (ముఖ ఎముకల) విభాగంలో నైపుణ్యం సాధించడానికి యువ వైద్యులకు సచిన్ ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ ఫెలోషిప్ కింద ఏటా MD చేసిన వైద్యులకు శ్రీనగర్‌లో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సచిన్ అందజేస్తారు. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వైద్యులకి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక సర్టిఫికేట్‌ను కూడా ప్రదానం చేయనున్నారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. అలాగే తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు ముందుగా క్రికెట్ మైదానం లేదా కోచ్‌లు గుర్తుకురారని, తన క్రికెట్ ప్రయాణం మొదట ఇంటి నుంచే ప్రారంభమైందని సచిన్ పేర్కొన్నారు. తనకు తొలి గురువు తన తండ్రేనని సచిన్ స్పష్టం చేశారు.
తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ ఒక ప్రొఫెసర్‌గానే కాకుండా, రచయితగా, కవిగా ఎంతో గుర్తింపు సాధించారన్నారు. అంతే కాకుండా తనకు అత్యుత్తమ మార్గదర్శిగా నిలిచారని సచిన్ పేర్కొన్నారు. తనకు ఇష్టమైన క్రీడను ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, అదే సమయంలో ఎన్ని విజయాలు సాధించినా సరే నైతిక విలువలను ఎప్పటికీ కోల్పోకూడదని తన తండ్రి చెప్పేవారని సచిన్ గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా యువ వైద్యుల కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. మా నాన్న నాలో అంతకంటే ఎక్కువ చూశారు. నేను ఏమవ్వాలో నిర్ణయించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. స్వయంగా కనుక్కొనేందుకు అవసరమైన స్వేచ్ఛను నాకు ఇచ్చారు. నా తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థుల కోసం ఫెలోషిప్‌ను అందించనుండటం సంతోషంగా ఉంది. మా నాన్న నమ్మిన సిద్ధాంతం ఇది. విద్యే అవకాశాలను సృష్టిస్తుందని ఆయన భావించారు. అది ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పరమార్థం మరొకటి ఉండదు. ఉపాధ్యాయుని పాఠాలు ఒక విద్యార్థితో ప్రారంభం కావచ్చు. కానీ, వారి ప్రభావం ఎందరో జీవితాలకు, ఎన్నో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అని సచిన్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
Also Read : BCCI సంచలనం.. 62 మంది క్రికెటర్లపై వేటు!









