
India vs Japan : 2026 ఆసియా క్రీడలకు ముందు టీమిండియా ఓ ప్రత్యేక మ్యాచ్ ఆడనుంది. జపాన్‌తో భారత జట్టు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనుంది. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్, జపాన్ మధ్య ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22, 2026న జరగనుంది. జపాన్‌లోని తోచిగిలో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ నిర్వహించనున్నారు.
భారత్, జపాన్ మధ్య జరిగే ఈ ఒక్క టీ20 మ్యాచ్‌కు సుజుకి కప్ అనే పేరు పెట్టారు. స్పోర్ట్ 75 కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలను మరింత పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. అలాగే 2036 ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలన్న ప్రయత్నాలకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ మ్యాచ్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంతోషం వ్యక్తం చేశారు. భారత, జపాన్ జట్లు ఇలాంటి ప్రత్యేక మ్యాచ్‌లో ఆడటం తమకు గర్వంగా ఉందని చెప్పారు. జపాన్‌తో పాటు తూర్పు ఆసియాలో క్రికెట్ ఆడే అవకాశం భారత ఆటగాళ్లకు రావడం మంచి విషయమని అన్నారు. జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ నయోకి మియాజీ కూడా ఈ మ్యాచ్‌ను స్వాగతించారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టును జపాన్‌లో ఆడేందుకు ఆహ్వానించడం తమకు ప్రత్యేకమైన విషయమని చెప్పారు. భారత క్రికెట్ అభిమానులతో పాటు జపాన్‌లోని క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్‌ను ఆస్వాదించాలని కోరారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టే జపాన్‌తో ఈ మ్యాచ్‌లో ఆడనుంది. ఇది అధికారిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో మ్యాచ్ ఫలితం, ఆటగాళ్ల ప్రదర్శన కూడా అధికారికంగా రికార్డవుతుంది. సెప్టెంబర్ 28 నుంచి ఆసియా క్రీడల్లో భారత్ మ్యాచ్‌లు మొదలవుతాయి. దీనికి ఆరు రోజుల ముందే జపాన్‌లో మ్యాచ్ ఆడటం టీమిండియాకు ఉపయోగపడనుంది. అక్కడి వాతావరణం, మైదానం, పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే అలవాటు పడే అవకాశం ఉంటుంది. దీంతో ఆసియా క్రీడలకు ముందు ఈ మ్యాచ్ టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌గా మారనుంది.









