Krishna Ashtami Puja : శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణాష్టమి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ద్వాపర యుగంలో ధర్మాన్ని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రావణ బహుళ అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ చిన్ని కృష్ణుడు అవతరించాడు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే మన ఇంట్లోని కష్టాలు, పాపాలు తొలగిపోయి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

కృష్ణాష్టమి పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, నదీస్నానం లేదా తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ముందుగా ఇల్లు, పూజా గదిని చక్కగా శుభ్రపరుచుకోవాలి. గడపలకు పసుపు, కుంకుమలు పెట్టి, తోరణాలు అమర్చి, రంగు రంగుల పువ్వులతో పూజా స్థలాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం నుంచి పూజ గది వరకు బియ్యపు పిండితో బాలకృష్ణుడి చిన్న చిన్న పాదాల గుర్తులను వేయడం ఒక సాంప్రదాయక ఆనవాయితీ.

Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!

పూజ గదిలో ఒక శుభ్రమైన పీటను ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. దానిపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచాలి. మన సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా, పూజ అయినా ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. అందువల్ల పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి, ధూపదీప నైవేద్యాలతో ప్రథమ పూజ చేయాలి. మీ వద్ద శ్రీకృష్ణుడి లోహ లేదా రాతి విగ్రహం ఉన్నట్లయితే, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమమైన పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి, విగ్రహాన్ని పొడి గుడ్డతో తుడిచి, గంధం, కుంకుమ, సుగంధ పుష్పాలు, తులసి మాలలతో అలంకరించాలి.

శ్రీకృష్ణాష్టమి పూజలో తులసి దళాలకు ఉన్న ప్రాధాన్యత అపారం. స్వామివారికి తులసి ఆకులంటే ఎంతో ప్రీతి. కాబట్టి పువ్వులతో పాటు తులసి ఆకులను సమర్పిస్తూ ‘విష్ణు సహస్రనామ పారాయణ’ లేదా శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. పూజ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ” లేదా “శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః” అనే దివ్య మంత్రాన్ని 108 సార్లు భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల మనశ్శాంతి చేకూరుతుంది.

శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి రాత్రి 12 గంటల సమయంలో స్వామికి విశేష పూజ నిర్వహించాలి. చిన్న కృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి ఊపుతూ, జోలపాటలు, సంకీర్తనలు పాడుతూ మహామంగళ హారతి ఇవ్వడం ఈ పండుగలోనే అత్యంత ప్రధానమైన, భక్తిరసమైన ఘట్టం. గోపాలుడైన శ్రీకృష్ణుడికి పాలు, వెన్న, పెరుగు, నెయ్యితో చేసిన పదార్థాలు అత్యంత ఇష్టమైనవి. అటుకులు, బెల్లం, కొద్దిగా కరిగించిన నెయ్యి కలిపిన అటుకుల ప్రసాదం, ఇంట్లో తాజాగా తీసిన స్వచ్ఛమైన వెన్న, పటిక బెల్లం, మీగడ, పాలను ప్రధానంగా సమర్పించాలి. వీటన్నిటితో పాటు మన సంప్రదాయ పిండివంటలైన చకోలీలు, మురుకులు, రవ్వ లడ్డూలు, పరమాన్నం, ఈ కాలంలో లభించే రకరకాల పండ్లను భక్తితో స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

శ్రీకృష్ణాష్టమి రోజున రోజంతా నిరాహారంగా ఉపవాసం ఉండటం శ్రేష్టం. అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు ఒక పూట మాత్రమే సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. పండుగ రోజున ఇంట్లో ఎలాంటి నాన్‌వెజ్ తీసుకోకుండా పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వండుకోవాలి. అర్ధరాత్రి పూజ పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి కృష్ణ లీలలను చదువుకుంటూ భాగవత కథలు వింటూ, నామస్మరణ, భజనలు చేస్తూ జాగరణ ఉండడం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. సాయంత్రం వేళ సంధ్యాసమయంలో ఇంటి ముందు ఉన్న తులసికోట వద్ద నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి తులసి దేవికి నమస్కరించుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

Also Read : చెన్నైలో ఒలింపిక్ సిటీ.. ఫార్ములా-1కు గ్రీన్ సిగ్నల్!