
Crime News : యూకేలో ఎంబీఏ చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకున్న ఈ విషాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రమావత్ సాయికిరణ్ (25) యూకేలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ మధ్యనే అతను స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉన్న సాయికిరణ్ మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బాసర సరస్వతి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు.
దర్శనం అనంతరం గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఫోటోలు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోదావరినదిలో పడిపోయాడు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు సాయికిరణ్ కోసం తీవ్రంగా గాలించారు. రాత్రి కావడంతో అతని ఆచూకీ లభించలేదు. కాగా తిరిగి బుధవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూ తమ కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన కొడుకు కండ్లముందే గోదావరిలో పడి చనిపోవడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









