
HBD Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ చిన్నప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఉంటారని చెబుతూ.. ఆయన వ్యక్తిత్వం, ప్రజాసేవను ప్రశంసిస్తూ చిరంజీవి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.
నిబద్ధతతో పనిచేయడం, ఏ పని చేసినా పూర్తిగా దానిలో నిమగ్నం కావడం, తన ప్రతి అడుగుతో పదిమందికి మంచి జరగాలని కోరుకోవడం పవన్‌లో చిన్నప్పటి నుంచే చూస్తున్నానని చిరంజీవి అన్నారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపై కూడా అంతే ప్రేమ, ఆప్యాయత చూపిస్తారని చెప్పారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం పవన్ ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందం, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. పిఠాపురం ప్రజలు తనను గెలిపించిన తర్వాత పవన్ వారిని కేవలం ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్.. భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటూ ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. చివరగా మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.









