Veligonda Project : మూడు దశాబ్దాల నిరీక్షణ…ఎన్నో ప్రభుత్వాలు…ఎన్నో హామీలు…వేల కోట్ల ఖర్చు…కొండలను చీల్చిన భారీ సొరంగాలు…కృష్ణా జలాలను కరువు నేలకు తీసుకురావాలన్న సంకల్పం…ఇప్పుడు ఆ వెలిగొండ కలలో తొలి అడుగు పూర్తయింది.మార్కాపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు…పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించారు.1996లో ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు…సరిగ్గా 30 ఏళ్ల తర్వాత…ఆ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించడం రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది.అసలు వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఏంటి..?ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది..?ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి లాభం..?ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుంది..?మరి నిర్వాసితుల పరిస్థితి ఏంటి..?వెలిగొండపై జరుగుతున్న రాజకీయ క్రెడిట్ వార్ ఏంటి..?ఈ స్టోరీలో పూర్తిగా చూద్దాం…

Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

అసలు వెలిగొండ ప్రాజెక్ట్ ఆలోచన ఎప్పుడు వచ్చింది..?

వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఒక్కరోజులో పుట్టిన ఆలోచన కాదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం… మార్కాపురం…గిద్దలూరు…కనిగిరి…ఎర్రగొండపాలెం…ఇలా అనేక ప్రాంతాలు ఏళ్ల తరబడి కరువుతో ఇబ్బంది పడుతున్నాయి. భూగర్భ జలాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. సాగుకు నీరు లేదు… తాగడానికి మంచినీరు లేదు…వర్షాలు పడితేనే వ్యవసాయం…వర్షాలు లేకపోతే వలసలు…ఈ పరిస్థితిని మార్చాలంటే… కృష్ణా నది వరద జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలు 1991 నుంచే జరిగాయి. 1994లో తొలి డీపీఆర్ సిద్ధమైంది. అయితే రాజకీయంగా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది మాత్రం 1996లో.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.అంటే…నేటి ప్రారంభోత్సవంతో ఒక ఆసక్తికరమైన రాజకీయ చరిత్ర కూడా పూర్తయినట్టే. శంకుస్థాపన చేసిన వ్యక్తే…30 ఏళ్ల తర్వాత ఫేజ్-1 ప్రారంభించడం ఇప్పుడు ప్రత్యేకంగా మారింది.

కానీ.. అసలు ప్రాజెక్ట్ పని ఎలా మొదలైంది..?

శంకుస్థాపన జరిగిన వెంటనే ప్రాజెక్ట్ పూర్తయిపోలేదు. అనుమతులు… డిజైన్లు… నిధులు… టెండర్లు… పర్యావరణ అంశాలు…అటవీ ప్రాంతంలో పనులు…భూసేకరణ…నిర్వాసితుల పునరావాసం…ఇలా ఒక్కో దశలో ఒక్కో సమస్య ఎదురైంది.అధికారిక రికార్డుల ప్రకారం…ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు నిర్మాణ పనులు 2005 తర్వాత వేగం అందుకున్నాయి. అప్పటి నుంచి వివిధ ప్రభుత్వాల హయాంలో పనులు కొనసాగుతూ వచ్చాయి. అంటే వెలిగొండ కథలో…ఒక్క పార్టీ… ఒక్క ప్రభుత్వం…ఒక్క నాయకుడు మాత్రమే లేరు. వివిధ దశల్లో… వివిధ ప్రభుత్వాలు…వివిధ స్థాయిల్లో ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా…ఎవరి హయాంలో ఎంత పని జరిగిందనే రాజకీయ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

వెలిగొండ అసలు ఇంజినీరింగ్ అద్భుతం ఏంటి..?

వెలిగొండ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే…కృష్ణా నది నీటిని పంపులతో ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు ఇది. ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తితో…అంటే నీరు సహజంగా దిగువ వైపు ప్రవహించే విధానంతో…నీటిని తీసుకురావాలన్నది దీని ప్రధాన డిజైన్. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని కొల్లంవాగు నుంచి…కృష్ణా వరద జలాలను తీసుకుంటారు. అక్కడి నుంచి…భారీ సొరంగాల ద్వారా…నల్లమల కొండలను దాటి…ఫీడర్ కెనాల్ ద్వారా…నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. ఇక్కడే వెలిగొండ ప్రాజెక్ట్ అసలు కష్టం కనిపిస్తుంది. ఎందుకంటే… నల్లమల అడవులు…కొండలు…కఠినమైన భౌగోళిక పరిస్థితులు…ఇవన్నీ దాటుకుని రెండు భారీ టన్నెల్స్ నిర్మించాల్సి వచ్చింది.

రెండు భారీ సొరంగాలు…

వెలిగొండ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైనవి ఈ ట్విన్ టన్నెల్స్. టన్నెల్-1 పొడవు దాదాపు 18.8 కిలోమీటర్లు. టన్నెల్-2 కూడా దాదాపు అంతే పొడవు. అంటే…నల్లమల కొండల కింద నుంచి…దాదాపు 19 కిలోమీటర్ల మేర భారీ సొరంగాలను తవ్వాల్సి వచ్చింది. ఇది సాధారణ పని కాదు. పనుల సమయంలో భౌగోళిక సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల నిర్మాణం…కొన్ని చోట్ల సాఫ్ట్ రాక్…కొన్ని చోట్ల టన్నెల్ బోరింగ్ మెషీన్లకు సమస్యలు… ఇలా ఎన్నో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. టన్నెల్-1లో ఒక దశలో టన్నెల్ బోరింగ్ మెషీన్ చిక్కుకుపోవడంతో పనులకు దీర్ఘకాలం ఆటంకం ఏర్పడింది. అంటే…
వెలిగొండ ఆలస్యం వెనుక రాజకీయ కారణాలు మాత్రమే కాదు…ఇలాంటి భారీ ఇంజినీరింగ్ సవాళ్లు కూడా ఉన్నాయి.

వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం ఎంత..?

ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం…వెలిగొండ ప్రాజెక్ట్ ఎంత పెద్దది..?ప్రాజెక్టు పూర్తి రూపకల్పన ప్రకారం…శ్రీశైలం నుంచి సుమారు 43.5 TMCల కృష్ణా వరద జలాలను తీసుకురావాలన్నది ప్రణాళిక. నల్లమలసాగర్ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం…సుమారు 53.85 TMCలు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు పూర్తయితే…సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ప్రకాశం… నెల్లూరు… కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు దీని ప్రయోజనం చేరాల్సి ఉంది. తాగునీటి పరంగా కూడా…లక్షలాది మందికి సురక్షిత నీరు అందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం.అయితే… ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. నేడు ప్రారంభమవుతున్నది మొత్తం ప్రాజెక్టు కాదు… ఫేజ్-1 మాత్రమే.

మరి ఫేజ్-1తో ఎంత లాభం..?

వెలిగొండ ఫేజ్-1లో…నల్లమలసాగర్‌లో సుమారు 10.70 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో… సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.అలాగే…ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు…దాదాపు 4 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుతుందని అంచనా.అంటే…ఫేజ్-1 ప్రారంభం అంటే… వెలిగొండ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిందని కాదు.కానీ…30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టులో…
మొదటి కీలక దశ ప్రజలకు అందుబాటులోకి వస్తోందన్నమాట.

ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రధాన లాభాలు ఏంటి..?

*మొదటిది…సాగునీరు.
ఇప్పటి వరకు వర్షాధారంగా సాగు చేస్తున్న ప్రాంతాలకు…స్థిరమైన నీటి వనరు అందే అవకాశం ఉంది.
*రెండోది… తాగునీరు.
ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భూగర్భజల సమస్య తీవ్రంగా ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉంది.కృష్ణా నీటిని తీసుకురావడం ద్వారా…సురక్షిత తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని అంచనా.
*మూడోది…వ్యవసాయంలో మార్పు.
నీటి లభ్యత పెరిగితే… ఒకే పంటపై ఆధారపడకుండా…రైతులు ఇతర పంటల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.
*నాలుగోది…భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గడం.
బోర్లు వేసి…భూగర్భ జలాలను అధికంగా వినియోగించే పరిస్థితి కొంత తగ్గవచ్చు.
*ఐదోది…ఆర్థిక అభివృద్ధి.
సాగు పెరిగితే…వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
అంటే…వెలిగొండ కేవలం ఒక నీటి ప్రాజెక్ట్ కాదు…ఈ ప్రాంత ఆర్థిక పరిస్థితిని మార్చగల ప్రాజెక్టుగా ప్రభుత్వం చెబుతోంది.

కానీ.. ప్రాజెక్ట్ వల్ల నష్టాలు లేవా..?

ఉన్నాయి..ఏ భారీ ప్రాజెక్ట్ అయినా…అభివృద్ధి తీసుకొస్తూనే…కొంతమందిపై ప్రభావం చూపుతుంది.వెలిగొండ విషయంలో ప్రధాన సమస్య…నిర్వాసితులు..నల్లమలసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా…కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.సుమారు 11 గ్రామాల ప్రజల పునరావాసం కీలక అంశంగా మారింది.ఇళ్లను వదిలి వెళ్లడం అంటే…కేవలం భూమి కోల్పోవడం కాదు.తరతరాలుగా ఉన్న ఊరు…వ్యవసాయం…పశువులు…ఉపాధి…దేవాలయం…అన్నింటినీ వదిలి కొత్త చోటికి వెళ్లాల్సిన పరిస్థితి.అందుకే…పరిహారం ఇచ్చాం అంటే సమస్య పూర్తయిందని నిర్వాసితులు అనుకోవడం లేదు.కొత్త చోట జీవనం ఎలా..? ఉపాధి ఎలా..? పశువులకు స్థలం ఉందా..? పిల్లలకు స్కూల్ ఉందా..? ఆసుపత్రి ఉందా..? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రభుత్వం మాత్రం… ఇటీవలి కాలంలో వేలాది నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించామని చెబుతోంది. అయితే…పునరావాసం పూర్తిగా సజావుగా జరిగిందా అన్న ప్రశ్న మాత్రం ఇంకా చర్చలో ఉంది.

వెలిగొండపై రాజకీయ క్రెడిట్ వార్ ఎందుకు..?

ఇప్పుడు అసలు రాజకీయ అంశానికి వస్తే…వెలిగొండ ప్రాజెక్ట్ చరిత్రే…ఒక రాజకీయ చర్చగా మారింది. TDP చెబుతున్న వాదన ఏంటి అంటే…1996లో చంద్రబాబే శంకుస్థాపన చేశారు…ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చినా…మళ్లీ అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేసి… ఇప్పుడు ఫేజ్-1 ప్రారంభిస్తున్నారని. ప్రత్యేకంగా…1996లో పునాది వేసిన వ్యక్తే… 2026లో ఫేజ్-1 ప్రారంభించడం… టీడీపీకి పెద్ద రాజకీయ పాయింట్‌గా మారింది.

మరోవైపు వైసీపీ వాదన ఏంటి అంటే…చంద్రబాబు హయాంలో కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని… తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుకు వేగం ఇచ్చిందని…టన్నెల్స్ సహా అనేక కీలక పనులు వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంటే… ఒకవైపు…  “శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు చంద్రబాబు విజన్”అని టీడీపీ చెబుతుంటే… మరోవైపు…”వివిధ ప్రభుత్వాల కృషిని చంద్రబాబు తన క్రెడిట్‌గా చెప్పుకుంటున్నారు” అనేది వైసీపీ విమర్శ.ఇక్కడ వాస్తవం ఏంటంటే…వెలిగొండ నిజంగానే దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ, పరిపాలనా ప్రయాణం. దీనిలో… టీడీపీ హయాం ఉంది…కాంగ్రెస్ హయాం ఉంది…వైసీపీ హయాం ఉంది…మళ్లీ టీడీపీ హయాం ఉంది. కాబట్టి… ఎవరి కాలంలో ఏ పని జరిగిందన్న దానిపై రాజకీయ పార్టీలు తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి.

మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది..?

ఈ ప్రశ్నకు ఒక్క కారణమని చెప్పలేం.
*మొదటిది…నిధుల సమస్య.
భారీ ప్రాజెక్ట్ కాబట్టి…వేల కోట్ల రూపాయల ఖర్చు అవసరమైంది.
*రెండోది…టన్నెల్ నిర్మాణం.
సాధారణ కాలువలు తవ్వినట్టుగా కాదు.నల్లమల కొండల కింద నుంచి…దాదాపు 19 కిలోమీటర్ల రెండు భారీ టన్నెల్స్ నిర్మించడం చాలా క్లిష్టమైన పని.
*మూడోది…భూసేకరణ, నిర్వాసితుల సమస్య.
భూములు సేకరించడం…పరిహారం ఇవ్వడం…పునరావాసం కల్పించడం…ఇవి కూడా పనులను ప్రభావితం చేశాయి.
*నాలుగోది…పరిపాలనా నిర్ణయాలు, అనుమతులు.
ప్రాజెక్ట్ డిజైన్ నుంచి…పలు సాంకేతిక, ఆర్థిక అనుమతుల వరకు…వివిధ దశల్లో ఆలస్యం జరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక కూడా…ప్రాజెక్ట్ ప్రణాళిక, అమలు, ఆర్థిక అంశాల్లో సమస్యలను ప్రస్తావించింది.
అంటే…వెలిగొండ ఆలస్యం కేవలం ఒక రాజకీయ పార్టీ వైఫల్యం అని చెప్పడం కంటే…ఇది భారీ ప్రాజెక్టులకు ఎదురయ్యే సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా, రాజకీయ సమస్యల కలయికగా చూడాలి.

Also Read : విశాఖలో దారుణం.. భార్య పిల్లలకు విషమిచ్చి… తాను ఉరివేసుకుని..

ఫేజ్-1 ప్రారంభమైంది… ఇక అసలు పరీక్ష ఏంటి..?

ప్రారంభోత్సవం ఒక మైలురాయి మాత్రమే. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. నీరు నిజంగా ఎంత మేర అందుబాటులోకి వస్తుంది..? ప్రతిపాదించిన 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు పూర్తిగా చేరుతుందా..? నిర్వాసితుల పునరావాసం పూర్తిగా జరుగుతుందా..? ఫేజ్-2 ఎప్పుడు పూర్తవుతుంది..? ఇవన్నీ ఇప్పుడు కీలక ప్రశ్నలు. ఎందుకంటే… ప్రాజెక్టు ప్రారంభించడం ఒక దశ అయితే…చివరి రైతు పొలానికి నీరు చేరడం అసలు విజయం.

మొత్తానికి…వెలిగొండ ప్రాజెక్ట్ అనేది…కేవలం ఒక డ్యామ్ కాదు… కేవలం రెండు టన్నెల్స్ కాదు…ఇది మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర. కరువుతో పోరాడిన ప్రాంత ప్రజల ఆశ. వేలాది కోట్ల ప్రజాధనం. కొండలను చీల్చిన ఇంజినీరింగ్ ప్రయత్నం. అదే సమయంలో… వేలాది నిర్వాసిత కుటుంబాల త్యాగం కూడా. 1996లో శంకుస్థాపన… 2005 తర్వాత ప్రధాన నిర్మాణ పనులు… వివిధ ప్రభుత్వాల హయాంలో కొనసాగిన ప్రయాణం… ఇప్పుడు 2026లో ఫేజ్-1 ప్రారంభం. ఇది ఖచ్చితంగా వెలిగొండ చరిత్రలో పెద్ద మైలురాయి.

అయితే…రాజకీయ క్రెడిట్ ఎవరికి దక్కుతుందన్న దానికంటే… ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా రైతు జీవితంలో మార్పు వస్తుందా..? కరువు నేలల్లో పంటలు పండుతాయా..? ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంచినీరు అందుతుందా..? నిర్వాసితులకు న్యాయం జరుగుతుందా..? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే… వెలిగొండ అసలు విజయం… వేదికపై రిబ్బన్ కట్ చేయడంలో కాదు… చివరి రైతు పొలంలో… మొదటిసారి కృష్ణమ్మ నీరు పారిన రోజే…

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.