Belagavi Chicken Party : వీకెండ్‌ పార్టీ ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. పార్టీలో చికెన్‌ ముక్కలు ఎక్కువగా తిన్నాడని తోటి స్నేహితుణ్ణి హత్య చేశాడో యువకుడు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆదివారం సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసుకున్న పార్టీలో చికెన్‌ తినే విషయంలో జరిగిన గొడవ పెద్దగా మారి ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సీతారామ్, అరుణ్ అనే యువకులు ఇద్దరూ కర్ణాటక రాష్ర్టం బెలగావిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీరిద్దరూ మరో నలుగురితో కలిసి స్థానికంగా ఒక రూమ్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం సెలవుదినం కావటంతో రూమ్‌మేట్స్ అందరూ కలసి మందు పార్టీ చేసుకున్నారు.

Also Read : వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బ్రేక్‌

పార్టీ సందర్భంగా చికెన్ కూడా వండుకున్నారు. మందు పార్టీ ముగిసిన అనంతరం అందరూ కలిసి భోజనానికి కూర్చుకున్నారు.. ఈ సందర్భంగా చికెన్ ముక్కల విషయంలో సీతారామ్, అరుణ్‌కు మధ్య గొడవ మొదలైంది. అరుణ్ అందరికంటే ఎక్కువ చికెన్ ముక్కలు తింటున్నాడని సీతారామ్ ఆరోపించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన అరుణ్ వంట చేసే కత్తితో సీతారామ్ ఛాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సీతారామ్ ప్రాణాల కోసం విలవిల్లాతుండటంతో మత్తునుంచి తేరుకున్న అరుణ్ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాడు. అక్కడ సీతారామ్‌ బిల్డింగ్ మీదనుంచి కిందపడ్డాడని డాక్టర్లకు అబద్ధం చెప్పాడు.

అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుడి పరిస్థితి చూసి అరుణ్ మీద పోలీసులకు అనుమానం వేసింది. దీంతో వారు అతడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో అరుణ్‌ చేసిన నేరం ఒప్పుకున్నాడు. చిన్న గొడవ ముదిరి పెద్దదైందని, కోపంలో తన స్నేహితున్ని కత్తితో పొడిచినట్లు చెప్పాడు. అదే సమయంలో చికిత్స పొందుతూ సీతారామ్ చనిపోయాడు. దీంతో పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read : 13 ఏళ్ల సర్వీస్‌కు గుడ్‌బై .. సీనియర్ ఐఏఎస్ అధికారి భావోద్వేగ లేఖ!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.