
Divya Mittal : సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో పనిచేసిన ఆమె.. ఇకపై ఐఏఎస్ అధికారిగా తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తన పదవి ముగిసినా.. దేశం కోసం తాను కన్న కలలు, చేయాలనుకున్న పనులు మాత్రం అలాగే ఉంటాయని ఆమె చెప్పారు.
2013 బ్యాచ్‌కు చెందిన దివ్య మిట్టల్ సివిల్స్‌లోకి రావడానికి ముందు లండన్‌లో ఫైనాన్స్ ఉద్యోగం చేశారు. అంతకుముందు ఢిల్లీలోని ఐఐటీ, బెంగళూరులోని ఐఐఎంలో చదువుకున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగం, మంచి జీవితం ఉన్నప్పటికీ.. ఏదో అసంపూర్తిగా ఉందన్న భావన ఆమెకు కలిగింది. తన చదువు, తనకు వచ్చిన అవకాశాలు దేశం వల్లే అని భావించి.. లండన్ ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు.
చిన్నతనంలో సాధారణ పరిస్థితుల్లో పెరిగాను. మంచి జీవితం, మంచి ఉద్యోగం ఉండాలని కలలు కన్నాను. ఎంతో కష్టపడి ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదివాను. ఆ తర్వాత లండన్‌లో ఉద్యోగం వచ్చింది. అన్నీ ఉన్నప్పటికీ.. ఏదో ఒకటి మాత్రం అసంపూర్తిగా ఉన్నట్లు అనిపించేదని దివ్య మిట్టల్ తన పోస్టులో రాశారు. నా దేశానికి దూరంగా ఉండటం నన్ను బాధించింది. నా చదువు, నా మీద నాకున్న నమ్మకం, ప్రపంచంలో ఎక్కడైనా ధైర్యంగా నిలబడగలిగే శక్తి.. ఇవన్నీ ఈ నేల నాకు ఇచ్చినవే. ఆ రుణం తీర్చుకోవాలనుకున్నాను. నేను కలలు కన్న భారతదేశాన్ని నిర్మించే పనిలో నా వంతు ఉండాలని అనుకున్నాను. అందుకే తిరిగి వచ్చాను. ఐఏఎస్ అధికారిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది అని ఆమె తెలిపారు.
ఐఏఎస్‌గా పనిచేసిన సమయంలో దివ్య మిట్టల్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. డెవరియా, మిర్జాపూర్, సంత్ కబీర్ నగర్ జిల్లాలకు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. డెవరియాలో పనిచేసినప్పుడు సరైన పని కోసం ఎంతటి పరిస్థితుల్లోనైనా నిలబడటం బాధ్యత అని తెలుసుకున్నానని చెప్పారు. మిర్జాపూర్ తనకు అసాధ్యం అనేది నిజం కాదని, అది మన అభిప్రాయం మాత్రమేనని నేర్పిందని తెలిపారు.









