సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సామాన్యుల జోబుకు చిల్లు పడనుంది. ఐటీఆర్‌ దాఖలు, ఎల్‌పీజీ ఈ-కేవైసీ గడువు ముగియడంతో పాటు కార్ల ధరలలో కొన్ని మార్పులు రానున్నాయి. అవేంటంటే?

నో ఇమ్మిగ్రేషన్ స్టాంప్

భారతదేశం నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఏరోపోర్ట్‌ ఇమ్మిగ్రేషన్ వద్ద డిజిటల్ ఊరట లభించనుంది. ఇప్పటివరకు కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌పై ఫిజికల్ స్టాంప్ వేయించుకోవడం తప్పనిసరిగా ఉండేది. అయితే సెప్టెంబర్ 1 నుంచి ఈ నియమం నుంచి మినహాయింపు లభిస్తుంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఇకపై తమ మొబైల్‌లోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌ను నేరుగా చూపించవచ్చు.

Also Read : వీకెండ్‌ పార్టీలో దారుణం.. చికెన్ ఎక్కువ తిన్నావన్నందుకు స్నేహితుడి హత్య

ఐటీఆర్, ఎల్‌పీజీ ఈ-కేవైసీకి ముగిసిన గడువు

ఆడిట్ అవసరం లేని ఖాతాలు కలిగిన పన్ను చెల్లింపుదారులకు 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీ. సకాలంలో రిటర్న్స్ సబ్మిట్ చేయని వారు ఆలస్య రుసుము, వడ్డీతో బిలేటెడ్ ఐటీఆర్ వేసుకోవాల్సి ఉంటుంది. మరొకవైపు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన ఆగస్టు 31 గడువు కూడా ముగుస్తోంది. ఇది పూర్తి చేయని వినియోగదారులు సెప్టెంబర్ 1 తర్వాత గ్యాస్ సిలిండర్ పొందే విషయంలో లేదా సంబంధిత సబ్సిడీ ప్రయోజనాలలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.

కార్ల ధరలు పెరుగుదల

సెప్టెంబర్ నుంచి కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థిక భారం తప్పదు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ వ్యయం పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మరో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ కూడా తమ వాహనాల ధరలపై గరిష్ఠంగా 1 శాతం వరకు పెంపును వర్తింపజేయనుంది.

ఎల్‌పీజీ ధరలు

ప్రతి నెలా మొదటి తారీఖున చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్లు, ఇంధన ధరల్లో మార్పులు చేపడతాయి. సెప్టెంబర్ 1న కూడా వాణిజ్య, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : 13 ఏళ్ల సర్వీస్‌కు గుడ్‌బై.. సీనియర్ ఐఏఎస్ అధికారి భావోద్వేగ లేఖ!