
Raksha Bandhan : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక కశ్మీరీ బాలికలు భారతీయ సైనికులకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. కుటుంబానికి దూరంగా దేశరక్షణ కోసం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ జవాన్లకు అక్కడి చిన్నారులు రాఖీలు కట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఈ వీడియోలో స్థానిక బాలికలు ఎంతో ఆప్యాయంగా జవాన్ల చేతులకు రాఖీలు కడుతూ కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక స్థానిక బాలిక మాట్లాడుతూ.. తనకు సొంత అన్నయ్య లేరు, కానీ ఈరోజు నాకు ఉన్నట్లే అనిపించింది. కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల పండగను జరుపుకోలేకపోతున్నామని జవాన్లు బాధపడుతుంటారు. కానీ మేం కూడా వాళ్ల చెల్లెళ్ళమే, వాళ్ల కుటుంబమే అని మనసులోని భావాలను పంచుకుంది.
#WATCH | Banihal, J&K: Local Kashmiri girls tie rakhis to Army jawans on Raksha Bandhan. pic.twitter.com/P661TuExvd
— ANI (@ANI) August 28, 2026
అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండగను శుక్రవారం ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున సోదరీమణులు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి రక్షణగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా ఇదే స్ఫూర్తిని చాటుతూ కశ్మీరీ బాలికలు జవాన్లతో ఈ వేడుకను జరుపుకోవడం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
సైనికులకు చిన్నారులు రాఖీలు కట్టిన ఈ అద్భుతమైన దృశ్యంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది ప్రేమ, నమ్మకానికి అసలైన అందమైన ఉదాహరణ అని ఒకరు కామెంట్ చేశారు. ఇండియాకు అసలైన అందం ఇదే అని మరో యూజర్ కామెంట్ చేశాడు.









