
Nepal Floods : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశంలో తీవ్ర ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అయితే నేపాల్‌కు ఈ వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడటం, గ్లేసియర్(హిమానీనదాలు) కరగడం వల్ల మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. నేపాల్‌కి మరో జల ప్రళయం ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఈసారి 5 రెట్ల తీవ్రతతో నేపాల్‌కు వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసుల పరుగులు పెడుతున్నారు. చాలామంది తీవ్ర భయాందోళనలో గడుపుతున్నారు.
Also Read : హర్మూజ్‌లో సీమైన్స్‌ను తొలగించేశాం: అమెరికా సంచలన ప్రకటన
హిమలయాల్లోని పర్వత ప్రాంతాల్లో అస్థిరంగా ఉన్న లోయలు, పాక్షికంగా విరిగిపడిన హిమానీనదం (గ్లేసియర్) కారణంగా రాబోయే రోజుల్లో మరోసారి భారీ స్థాయిలో వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ప్రస్తుత వరదల ధాటికి లెండె నది లోయలో ఉన్న నిటారుగా ఉండే రాళ్లు, వాలు ప్రాంతాలు తీవ్రంగా కోతకు గురయ్యాయని వారు పేర్కొన్నారు. మరోవైపు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే అక్కడక్కడా చిన్నపాటి కొండచరియలు విరిగిపడిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల పెద్ద రాళ్లు పడటానికి, నది ప్రవాహాన్ని అడ్డుకోవడానికి దారితీసే పరిస్థితి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో భయం గుప్పెట్లో ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు.
ముఖ్యంగా టిబెట్ సరిహద్దుల్లోని గ్యాంగ్‌భు గ్లేసియర్ వద్ద ఏర్పడిన పగుళ్ల మూలంగా ప్రధానమైన ముప్పు పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మళ్లీ భూకంపం లేదా ప్రకంపనలు గనుక వస్తే మిగిలిన గ్లేసియర్ భాగం కూడా విరిగి లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే వరద ఉధృతి మళ్లీ విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. మరోవైపు రసువాగధి సరిహద్దుకు ఎగువన ఉన్న లెండె నది ప్రవాహం ఆగిపోయింది. దీంతో అక్కడ పెద్ద సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు కట్టలు గునక తెగితే కింది ప్రాంతాలకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (NDRRMA) అధికారులు అప్రమత్తమయ్యారు. భోటేకోషి నది దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, ప్రయాణికులు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ సంస్థ సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నదీ తీరాలకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు అక్కడి నుంచి రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది.ఇక ఇప్పటికే వరదల మూలంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా వరదల్లో గల్లంతయిన వారి కోసం నేపాల్ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.









