
GV Narayana Rao : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జీవీ నారాయణరావు ఈ రోజు కన్ను మూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నారాయణ రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
సీనియర్ నటుడు అయిన నారాయణ రావు 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో తొలిసారి ఆయన నటుడిగా పరిచమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న నారాయణరావు.. లెజెండ్ నటులు రజనీకాంత్, చిరంజీవిలకు మంచి మిత్రుడు. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, హిట్లర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళి నీకు శుభం నాకు తదితర సినిమాలను నిర్మించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆలోచన’ విడుదల కావాల్సి ఉంది. నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్ర సంతాపం తెలిపింది.
Also Read : టాక్సిక్ రచ్చ.. ఇరుముడి సినిమా కోసం థియేటర్ ముందు జనం ధర్నా!
నారాయణ రావు కృష్టజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. నారాయణ రావు బాల్యం, విద్యాబ్యాసం అంతా గుంతకల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారాయన. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించి మెప్పించారు. దివంగత సినిమా నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు రంగస్థల మిత్రులు. రంగస్థలం నుంచి వచ్చిన ఆయన సినిమాలతో పాటు పలు టి.వి.సీరియళ్లలోనూ నటించారు. చదువుకునే రోజుల్లోనే ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయం’, ‘మంచుతెర’ తదితర నాటకాల్లో నటించి మన్ననలు అందుకున్నారు.
రంగస్థలం నుంచి కెరీర్ ప్రారంభించి.. సినిమాలు, టీవీ వరకు కొనసాగించిన జీవీ నారాయణ రావు ఇక లేరనే వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రస్తుతం జీవీ నారాయణరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం మార్చురీలో ఉంచారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు అవినాష్, యూకేలో ఉంటున్న కుమార్తె లలిత యామిని, అల్లుడు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు జీవీ నారాయణరావు మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు.
Also Read : రక్షాబంధన్ యాడ్ లొల్లి.. కృతి సనన్ బోల్డ్ కౌంటర్!









