US-Canada Trade War : అమెరికా (USA), కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలతో కెనడాపై విరుచుకుపడగా.. కెనడా సైతం తానేం తక్కువ కాదని నిరూపిస్తూ అగ్రరాజ్యంపై తాజాగా ప్రతీకార సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు 20బిలియన్ డాలర్లు) విలువైన 700 వస్తువులపై దాదాపు 20 బిలియన్ డాలర్ల వరకూ సుంకాలను విధిస్తున్నామని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. 700లకు పైగా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ ఈ మేరకు ప్రకటించారు. మరోవైపు, యూఎస్ సుంకాల భారం నుంచి కెనడా వ్యాపారులు, సంస్థలను కాపాడుకునేందుకు 5.42 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. అమెరికా సుంకాలతో అధికంగా ప్రభావితమయ్యే చిన్న, మధ్యస్థాయి వ్యాపారాల కోసం ఈ ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే నెల 8 నుంచీ ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కెనడా పేర్కొంది.

కాగా, 25 శాతం సుంకాల ప్రభావం పడనున్న వస్తువుల్లో గృహోపకరణాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, చేపలు, సముద్రపు ఆహారం వంటివి ఉన్నాయి. ఇక ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, వస్త్రాలకు అత్యధికంగా 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 15, 25 శాతం చొప్పున ప్రతి-సుంకాలు ఉంటాయని కెనడా ప్రకటించింది. కెనడియన్ కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్ విడిభాగాలు ఉక్కు దిగుమతులపై ట్రంప్‌ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడడం గమనార్హం.

Also Read : ఇరాన్ వార్.. అమెరికా రైతులకు అంతులేని నష్టం.. అసలేం జరుగుతోంది?

కాగా, ‘అమెరికా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు కెనడా ప్రయోజనాలకు అనుకూలంగా లేవని, కెనడా నుంచి ఎక్కువ ఆశిస్తున్న అగ్రరాజ్యం.. ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ వనరులను ఇస్తోందని కెనడా ఆరోపించింది. అందువల్లే మా కార్మికులు, వ్యాపారాలు, వ్యూహాత్మక రంగాలు.. జాతీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దేశంతో చర్చలు నిలివేశాం’ అని కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో కెనడా దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటోందని మరోవైపు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఆరోపించడం గమనార్హం. తాజా సుంకాలతో ట్రంప్‌ దాని దోపిడీకి ముగింపు పలికారని వెల్లడించింది. వివక్షపూరితమైన ఆ దేశ వాణిజ్య పద్ధతులను ఇకపై తాము అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ‘చర్చల సమయంలో ఉక్కు, అల్యూమినియం, కలప ఇతర వస్తువులపై భారీ తగ్గింపులు చేపట్టడానికి హామీ ఇచ్చాం. ప్రపంచంలోని ఏ దేశానికీ ఇవ్వని ప్రాధాన్యతను కెనడాకు ఇచ్చాం. అయినప్పటికీ ఒప్పందం నుంచి వైదొలిగారు. చర్చలకు బదులుగా ప్రతీకారాన్ని ఎంచుకున్నారు’ అని అమెరికా పేర్కొంది.

వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇటీవల అర్థాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కెనడాపై పెద్ద స్థాయిలో సుంకాలు విధించారు. ఈ నెల 22 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ చర్యను కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆర్థిక దాడిగా అభివర్ణించారు. ‘దాడి జరిగితే యుద్ధం మొదలైనట్టే. మాపై దాడి జరిగింది’ అని ఆయన తీవ్రంగా అన్నారు. సరిహద్దు భద్రత, ఆటోమొబైల్, పరిశ్రామిక విధానాల విషయంలో కెనడా, అమెరికా మధ్య ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో అమెరికా తెచ్చిన ప్రతిపాదనలు తమ ఆర్థిక సార్వభౌమత్యాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయని కెనడా ఆరోపించడమే కాకుండా చర్చల నుంచి తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కు పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలు విధించగా కెనడా కూడా ప్రతీకార సుంకాలను ప్రయోగించింది.

Also Read : ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది పసివాళ్లు సజీవదహనం

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.