Shamshabad Airport : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌)లు మారనున్నాయి. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్‌ఏ) ఆమోదించిన నిబంధనల ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులపై యూడీఎఫ్‌ కొంత తగ్గనుండగా, ఇక్కడ దిగే ప్రయాణికులపై కొంత భారం పడనుంది. 2026 సెప్టెంబరు 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఈ ఛార్జీలు అమల్లో ఉంటాయి. కాగా, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) సంస్థ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విమాన గేట్‌ వద్దకు వెళ్లేవారు, విమానం దిగి వచ్చేవారు కూడా ట్రావలేటర్లు, కన్వేయర్‌ బెల్టులనుఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి సౌకర్యాలపై భారాన్ని ఇరు వర్గాలకూ విధింంచేందుకు సిద్ధమైంది.

Also Read : గుడ్‌న్యూస్: సీటీఈటీ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈ తేదీలోగా అప్లై చేసుకోండి!

కాగా, నూతన నిబంధనల ప్రకారం శంషాబాద్‌ నుంచి బయలుదేరే వారికి అంటే దేశీయ ప్రయాణికులకు యూడీఎఫ్‌ రూ.750 నుంచి రూ.515కు తగ్గించారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.1,500 ఫీజు రూ. 1,030కి తగ్గనుంది. ఇక్కడికి వచ్చే దేశీయ ప్రయాణికులకు రూ.220, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.440 వసూలు చేస్తారు. అయితే ఈ యూడీఎఫ్‌ను విమాన టికెట్‌లోనే కలిసి వసూలు చేయనున్నారు. యూడీఎఫ్‌ అనేది ప్రతి అయిదేళ్లకు ఒకసారి మారుతుంది. దాని ప్రకారం ఇక్కడినుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికుడి ఛార్జీ రూ.515తో ప్రారంభమై, 2027-28లో రూ.555కు, 2028-29లో రూ.620కు, 2029ఏప్రిల్‌-అక్టోబరు మధ్య రూ.670కు చేరుకోనుంది.2029 నవంబరులో ఈ బేస్‌లైన్‌ ఫీజు రూ.415కు తగ్గనుంది. ఇక దిగే దేశీయ ప్రయాణికుల ఫీజు రూ.220తో మొదలై క్రమంగా రూ.240, రూ.265, రూ.285కు పెరనుంది. 2029 నవంబరులో రూ.175కు దిగి రానుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు యూడీఎఫ్‌ రూ.440తో ప్రారంభమై.. రూ.500కు చేరి, 2029 నాటికి రూ.375కు తగ్గనుంది. చివరి ఏడాదిలో రూ.390గా ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ యూడిఎఫ్‌ పీజు వసూలుకు ఒక నిబంధన ఉంది. విమాన శ్రయంలో నిర్మాణంలో ఉన్న మౌలిక వసతులు పూర్తయి, అందుబాటులోకి వస్తేనే, సంబంధిత వ్యయాలు వసూలు చేయాలని నియంత్రణ సంస్థ తేల్చి చెప్పింది.శంషాబాద్‌ విమాన శ్రయంలో చేపడుతున్న నార్తర్న్‌ రన్‌వే, నార్తర్న్‌ ప్రిసింక్ట్‌ డెవలప్‌మెంట్‌లు పూర్తయ్యే ఆధారంగా 2029 నవంబరు 1 నుంచి మాత్రమే అదనపు వసూళ్లకు అనుమతి ఉంది. ఈ ప్రాజెక్టులు 2029 సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. నార్తర్న్‌ ప్రిసింక్ట్‌లో భాగంగా ఏటా అదనంగా రెండు కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న కొత్త టెర్మినల్‌ నిర్మితమవుతోంది. ఈ మౌలిక వసతులు సిద్ధమయ్యాక దేశీయంగా వెళ్లే ప్రయాణికుడిపై రూ.286, కొత్త టెర్మినల్‌కు వచ్చే వారిపై రూ.122 అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ ప్రయాణికులు రన్‌వేకుగాను వెళ్లేటప్పుడు రూ.175, వచ్చేటప్పుడు రూ.75, కొత్త టెర్మినల్‌కు వెళ్లేప్పుడు రూ.160, వచ్చినప్పుడు రూ.70 చొప్పున అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు విమానాల ల్యాండింగ్‌ ధరలను కూడా నియంత్రణ సంస్థ క్రమద్దీకరించడం గమనార్హం. దేశీయ విమాన సర్వీసులకు మెట్రిక్‌ టన్నుకు రూ.435, అంతర్జాతీయ సర్వీసులకు రూ.630గా ఛార్జీలను వసూలు చేయనున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు, కొత్త మార్గాల ద్వారా విస్తరణను ప్రోత్సహించేందుకు ల్యాండింగ్‌ ఛార్జీల ఆధారిత వేరియబుల్‌ టారిఫ్‌ ప్లాన్‌ (వీటీపీ) ప్రవేశపెట్టేందుకు ఏఈఆర్‌ఏ ఈ మేరకు అనుమతి ఇచ్చింది. నిర్దేశిత అర్హతలను పూర్తి చేసిన విమానయాన సంస్థలు ఈ ప్రోత్సాహక పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది.

Also Read : ఆలయంలో రచ్చ రచ్చ: మహిళా ఎస్సైని చెంపదెబ్బ కొట్టిన BJP MLA కూతురు..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.