
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 22వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. గతంలో రిజిస్టర్ చేసుకోలేకపోయిన అభ్యర్థుల కోసం మరో అవకాశం కల్పిస్తూ సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఈ దరఖాస్తు గడువును తిరిగి తెరిచినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ అర్హతను సాధించడానికి తగిన సమయం ఉండేలా ఈ అదనపు అవకాశం కల్పించినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. మునుపటి దరఖాస్తు గడువును కోల్పోయిన అభ్యర్థులందరికీ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని బోర్డు పేర్కొంది.
ఈ 22వ సీటీఈటీ నోటిఫికేషన్ మే 8న విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులను మే 11 నుండి జూన్ 10 వరకు స్వీకరించారు. అయితే తాజా పొడిగింపుతో అభ్యర్థులకు మళ్లీ అవకాశం లభించింది.
పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
దరఖాస్తు గడువు మళ్లీ తెరవడంతో పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై అభ్యర్థులలో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 1న దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత సవరించిన పరీక్ష తేదీని ప్రకటిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. వాస్తవానికి ఈ పరీక్షను సెప్టెంబర్‌లోనే నిర్వహించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ ఇప్పటివరకు 21 విడతలుగా సీటీఈటీ పరీక్షలను నిర్వహించింది. 21వ విడత ఫలితాలు మార్చి 30నే విడుదలయ్యాయి.









