
UP Cabinet : ఉత్తరప్రదేశ్ లోని వృద్ధ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లోక్‌మాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన అనే నూతన పథకానికి ఆమోదం తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అన్ని సాధారణ బస్సులలో 60 సంవత్సరాలు నిండిన మహిళలు జీవితాంతం ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు కోటికి పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ తెలిపారు. 60 ఏళ్లు పైబడిన మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందడానికి తమ ఓటర్ ఐడీ కార్డును చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఇక మరోవైపు రాష్ట్ర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి దాదాపు 4,000 కోట్ల రూపాయల వ్యయంతో సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ బస్సుల జాబితాలో చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, పోలీస్ శాఖలోని వివిధ యూనిట్ల అవసరాల నిమిత్తం 1,323 కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి నిధులు కేటాయించారు.
సుల్తాన్‌పూర్ సమీపంలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర సుమారు 27,225 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్ క్లస్టర్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రోజ్‌గార్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ కింద యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే మరో ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు.









