OG 2 Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సినిమా విడుదలైనప్పుడే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంతకాలం విరామం ఇవ్వనున్నట్లు చెప్పడంతో ‘ఓజీ 2’ భవిష్యత్తుపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026
ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తాజాగా కీలక ప్రకటన చేశారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘ఓజీ 2’ తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సీక్వెల్‌ను రూపొందిస్తామని తెలిపారు.
అలాగే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత సినిమా తదుపరి ప్రణాళికలపై చర్చలు జరుపుతామని వెల్లడించారు. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ అప్‌డేట్ తో ‘ఓజీ 2’పై వస్తున్న అన్ని ఊహాగానాలకు ముగింపు పడింది. మరోసారి ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్‌ను పెద్ద తెరపై చూడబోతున్నామని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చాక వచ్చే అధికారిక ప్రకటన పైనే ఉంది.










