Saturday, June 13, 23:05
27.8 C
Hyderabad

Pawan Kalyan : హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పవన్ ఫైర్

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌ ఎవరి జాగీరు కాదని, తనను తెలంగాణలోకి రావద్దనడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ పెట్టుకునేం దుకు తనకు అనుమతి నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు ఎప్పుడూ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలలుగా ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ భేదాలను ప్రస్తావించడంపై పవన్ కళ్యాణ్ జాతీయ మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి దేశాన్ని విడదీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇదే తర్కాన్ని వర్తింపజేస్తే.. భారతదేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారేనని, వారి మాతృభాష హిందీ కాదని గుర్తు చేశారు. సామాన్యులు ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు కానీ, సీఎం హోదాలో ఉండి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే దేశంలో ఎవరూ బ్రతకలేరని, ఇలాంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఇక తనను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ కొందరు అల్లరి మూకలను తనపైకి పంపుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన సొంత దేశంలో, మాతృభూమిలో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, ఇందుకోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీనే తనను హైదరాబాద్ రావద్దని చెబితే.. దానికి ప్రతిగా తాము కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అసలు దక్షిణ భారతదేశంతో ఏం సంబంధం ఉందో ప్రశ్నించాల్సి వస్తుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇక్కడి వాడు కాకపోయినా ఇక్కడ పర్యటించడం లేదా అనే కోణంలో ఆయన కాంగ్రెస్‌ను నిలదీశారు.

తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు మరియు కేడర్ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే ఉన్నప్పటికీ, తెలంగాణలో తనకు బలమైన కేడర్ ఉందన్నారు. 2007 నుంచి తెలంగాణ యువత తనను నమ్మి తనతోనే నడుస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తనకు తెలంగాణలో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ.. తన పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ పూర్తిగా కట్టుబడి ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.