Saturday, June 13, 19:26
30.8 C
Hyderabad

లీకు వీరులపై సీఎం రేవంత్ విచారణ .. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

TPCC Chief Mahesh Kumar Goud
TPCC Chief Mahesh Kumar Goud

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసు లేకపోయినా, ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినా, కేవలం ఒక నోటీసును సాకుగా చూపి దుర్బుద్ధితో నామినేషన్‌ను తిరస్కరించడం దారుణమన్నారు. రాజ్యసభలో ఎలాగైనా తమ బలాన్ని పెంచుకోవాలనే కుట్రతోనే బీజేపీ ఈ పనికి ఒడిగట్టిందని ఆరోపించారు. గాంధేయవాది, నిజాయితీకి నిలువుటద్దం అయిన మీనాక్షి నటరాజన్ తనకు సోదరి లాంటి వారని, అలాంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నేరుగా జోక్యం చేసుకుని కేసును తప్పుదోవ పట్టించిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రిటర్నింగ్ అధికారి తన పరిధిని దాటి ప్రవర్తించారని, ఇలాంటి తప్పు చేసినందుకు ఆ ఆర్ఓను ఉరితీసినా తప్పులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 24 గంటలు గడుస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. దురదృష్టవశాత్తూ సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంలో న్యాయం జరగలేదని, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గపు పనులు చేసి ఉంటే మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు సీట్లను కూడా చోరీ చేస్తోందని, గతంలో బెంగాల్, మహారాష్ట్రలో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని మండిపడ్డారు.

పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. అంత తొందరపడి దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. తన ఆస్తులు, తన వ్యక్తిత్వం ఏంటో నిజామాబాద్ ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. స్వయంగా షబ్బీర్ అలీనే ముఖ్యమంత్రి సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలో చేర్పించారని, అయినప్పటికీ ఇప్పుడు ఆయన అలా మాట్లాడటం సబబు కాదన్నారు. ఈ క్రమంలోనే షబ్బీర్ అలీకి పార్టీ తరపున షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఒక ఏడాది కిందటి ఆడియోను ఇప్పుడు బయటకు తీసి, మహిళలను చులకన చేసి మాట్లాడటం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు.

హరీష్ రావుకు బాగా తెలుసు

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ట్వీట్లపై స్పందిస్తూ.. లీకులు ఇచ్చుకునే వారు, గ్రీకు వీరులు ఏవో మాట్లాడుతుంటారని, వాటిపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. తాను ఏంటో, తన నైజం ఏంటో కేటీఆర్ కంటే ఆయన బావ హరీష్ రావుకు చాలా బాగా తెలుసని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.